ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా పాలన..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రులు

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా పాలన..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రులు

నెట్​వర్క్, వెలుగు : రాచరికపు చీకట్లను చీల్చి, ప్రజాస్వామ్య ఉదయానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పేర్కొన్నారు.

 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌‌లో విలీనమైన సెప్టెంబర్ 17 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో మంత్రి వాకిటి శ్రీహరి, యాదాద్రిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపేటలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, నాగర్‌‌కర్నూల్‌‌లో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, గద్వాలలో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, వనపర్తిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 

 పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకమైన పాలన అందిస్తోందని తెలిపారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం ద్వారా తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం కల్పించామని పేర్కొన్నారు.

 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరు గ్యారంటీల అమలుతో పాటు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు, రూ.500కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు, మెగా జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నేతలు వివరించారు. 

సూర్యాపేట జిల్లాలో రూ.2,889.66 కోట్ల సాగునీటి పథకాలతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోందని, సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నారాయణపేటలో మక్తల్-కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గద్వాలలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో పాటు వనపర్తి జిల్లాలో తాగు, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. కాగా, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.