ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్బీఐ రెడీ

ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్బీఐ రెడీ
  •     మీర్‌‌‌‌ఖాన్‌‌‌‌పేటలో 10 ఎకరాలస్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం
  •     అంతర్జాతీయ టెక్ హబ్‌‌‌‌గా మారుతున్న ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫ్యూచర్ సిటీలో తన సొంత మెగా డేటా సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్‌‌‌‌బీఐ సిద్ధమైంది. అందుకోసం రంగారెడ్డి జిల్లాలోని మీర్‌‌‌‌ఖాన్‌‌‌‌పేట పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. తొలుత ఈ డేటా సెంటర్‌‌‌‌కు 8 ఎకరాల వరకు ఇవ్వాలని భావించినప్పటికీ, ఎస్‌‌‌‌బీఐ అభ్యర్థన మేరకు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మీర్‌‌‌‌ఖాన్‌‌‌‌పేట ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలకు హబ్‌‌‌‌గా మారుతోంది. అమెజాన్ సంస్థ కూడా ఇదే ప్రాంతంలో డేటా సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది జులైలో ఆ సంస్థ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. 2010లో అప్పటి ఎస్‌‌‌‌బీహెచ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ కాంప్లెక్స్ కోసం ఎకరా రూ.2.5 కోట్ల చొప్పున రాయదుర్గం నాలెడ్జ్‌‌‌‌ సిటీలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టలేదనే కారణంతో టీజీఐఐసీ దాన్ని బహిరంగ వేలంలో రూ.1,038 కోట్లకు విక్రయించగా, దీనిపై ఎస్‌‌‌‌బీఐ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. దాంతో ప్రభుత్వ ఖాతాలు, ఉద్యోగుల జీతాల నిధులను ఇతర బ్యాంకులకు మళ్లిస్తామని ప్రభుత్వం హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, చివరకు ప్రభుత్వం ఎస్‌‌‌‌బీఐకి వేరే ప్రాంతంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించేందుకు అంగీకరించడం, దానికి బ్యాంక్ బోర్డు ఆమోదం తెలపడంతో ఎస్‌‌‌‌బీఐ తన పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకుని ఈ కోర్టు వివాదానికి ముగింపు పలికింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యూచర్​ సిటీలో ప్రభుత్వం ఎస్‌‌‌‌బీఐకి డేటా సెంటర్​ ఏర్పాటుకు స్థలం కేటాయించింది.