బెంగాల్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ అరెస్ట్

బెంగాల్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ అరెస్ట్

కోల్‎కతా: ఉప ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఇప్పటికే టీఎంసీ పార్టీ గుర్తు, పేరును  కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే అనుహ్యంగా నందిగ్రామ్ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో నందిగ్రామ్ ఉప ఎన్నిక బరిలో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. 

దీదీ కాంగ్రెస్‎కు మద్దతు ప్రకటించిన గంటల వ్యవధిలోనే బెంగాల్ పాలిటిక్స్‎లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ అరెస్ట్ అయ్యారు. 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అభ్యర్థిని పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం (సెప్టెంబర్ 18) అదుపులోకి తీసుకున్నారు. మిలన్ ప్రధాన్ అరెస్ట్ బెంగాల్ రాజకీయాలను మరింత హీటెక్కించింది. మిలన్ ప్రధాన్ అరెస్టును టీఎంసీ, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. ఎన్నికలకు భయపడే అధికార బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించాయి. 

►ALSO READ | నందిగ్రామ్ బైపోల్‎లో బిగ్ ట్విస్ట్.. పోటీ నుంచి TMC అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‎కు మమతా సపోర్ట్

ఎన్నికల్లో నేరుగా ఎదుర్కొలేక పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్, టీఎంసీ ఫైర్ అయ్యాయి. 2007 నాటి కేసులో కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడు అరెస్ట్ చేయడంతో బీజేపీ ఓటమికి భయపడుతోందని అర్థం అవుతుందన్నాయి. పోలీసులు, ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించాయి. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‎ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. 

అక్టోబర్ 6న నందిగ్రామ్ బై పోల్

బెంగాల్ సీఎం సువేందు అధికారి రాజీనామాతో నందిగ్రామ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2026 బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్, భవానీపూర్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించడంతో నందిగ్రామ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 2026, అక్టోబర్ 6న బై పోల్ జరగనుండగా.. అక్టోబర్ 9న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సీఎం సువేందు అధికారి మాజీ పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి హసిరానీ రథ్‎ను బీజేపీ నందిగ్రామ్ నుంచి బరిలోకి దించింది.