కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో బీహార్లో ఒక తండ్రి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా.. కన్న కూతురికి శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేసిన ఘటన బీహార్లో వెలుగుచూసింది.
ఈ ఘటన బీహార్లోని పూర్ణియా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపయ్ గ్రామంలో జరిగింది. 18 ఏళ్ల వయసులో కూతురు తీసుకున్న నిర్ణయానికి తండ్రి విధించిన శిక్ష ఇది. కుటుంబ సభ్యులు ఆమె ఫోటోతో ఒక దిష్టిబొమ్మను తయారు చేసి, ఆ ప్రాంతంలో శవయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలు చేశారు.
A shocking incident has emerged from Purnia, where a father reportedly performed the symbolic funeral of his living daughter after she married a man from another caste.
— The Daily Jagran (@TheDailyJagran) September 16, 2026
After police recovered Riya Kumari from Delhi and she reportedly supported the man in her court statement, her… pic.twitter.com/sCTPRryYUM
రియా అనే ఈ 18 ఏళ్ల యువతి సెప్టెంబర్ 8న 24 ఏళ్ల మినాల్ కుమార్‌తో కలిసి పారిపోయి, కోర్టులో అతడినిని పెళ్లి చేసుకుంది. తన కూతురిని కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి మనోజ్ కుమార్ గోస్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రియా ఢిల్లీలో ఉందని తేల్చారు. కోర్టులో ఆమెను హాజరుపరిచారు. అక్కడ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రియా, మినాల్ సుమారు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మినాల్ దళిత కుటుంబానికి చెందిన యువకుడు.
ఇద్దరి ఇళ్లకు కేవలం 100 మీటర్ల దూరమే. ఈ కాస్త దూరమే ఇద్దరినీ దగ్గర చేసింది. రియా కాలేజీకి వెళ్తున్నప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇలా మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మినాల్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయలేదని, తానే స్వచ్ఛందంగా పెళ్లి చేసుకున్నానని రియా వాంగ్మూలం ఇచ్చింది. ఈ పరిణామంతో కన్న కూతురిపై విరక్తి చెందిన తండ్రి మనోజ్ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. కర్మకాండలను కూడా నిర్వహించాలని ఆ కుటుంబం భావిస్తుంది.
►ALSO READ | బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్
భాగల్పూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో రియా వివాహాన్ని కుటుంబం ఇప్పటికే నిశ్చయించిందని ఆమె తండ్రి మనోజ్ చెప్పాడు. రూ. 6 లక్షల కట్నం ఇచ్చి కూతురికి మంచి సంబంధం కుదిర్చానని, నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉందని తెలిపాడు. పెళ్లి ఏర్పాట్లలో తాము ఉంటే ఆమె ఇలా చేసిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పెళ్లి కొడుకు కుటుంబానికి తాము ఏం సమాధానం చెప్పాలని నిలదీశాడు. పెంచి.. పెద్ద చేసి.. చదువు చెప్పిస్తే తమ మీద కనీస ప్రేమ కూడా లేకుండా వెళ్లిపోయిందని.. ఇలాంటి కూతురు మరెవరికీ ఉండొద్దని మనోజ్ కన్నీరుమున్నీరయ్యాడు. తమ కుటుంబం దృష్టిలో రియా చచ్చిపోయిందని తేల్చి చెప్పాడు.
