హైదరాబాద్: ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధమని, యుద్ధం తనకేం కొత్త కాదని చెప్పారు.
మళ్లీ పోరాడుతానని, మళ్లీ గెలుస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 18న తీర్పు వెల్లడించింది.
►ALSO READ | ప్రజాస్వామ్య విజయం.. దానం నాగేందర్ అనర్హత వేటు తీర్పుపై బండి సంజయ్ స్పందన
బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో పాటు, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయడం అనర్హతకు దారితీస్తుందనే పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని హైకోర్టు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. పార్టీ మారిన మరికొందరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
