- కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే హామీల అమలు
- ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
- మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరణ
- జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడి
మెదక్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే అభయహస్తం హామీల అమలుకు శ్రీకారం చుట్టిందని ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. మహిళలు, రైతులు, పేదలు, విద్యార్థులు, కార్మికులు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై 78 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గడ్డపై స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం కోసం అనేక మంది త్యాగాలు చేశారని ఆయన గుర్తుచేశారు. 1947 ఆగస్టు15న దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగితేలుతుంటే.. హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తీవ్రతరమైందని.. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహిళా యోధులు పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. బండి యాదగిరి రాసిన ‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ వంటి పాటలు ప్రజల్లో స్ఫూర్తిని నింపాయన్నారు.
అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అభివృద్ధి
మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వివేక్ తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్‌ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 4.73 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని.. దీనివల్ల వారికి రూ.171 కోట్ల మేరకు మేలు జరిగిందన్నారు. అలాగే, గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,29,756 మందికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. ఇందుకు రూ.113.80 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు 2,42,353 కుటుంబాలకు 15,033 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశామని.. జిల్లాలో 28,582 కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామని చెప్పారు.
మెదక్‌లో మెడికల్ కాలేజీ బిల్డింగ్ కు రూ.180 కోట్లు, నర్సింగ్ కాలేజీ బిల్డింగ్‌కు రూ.26 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాకు రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం రూ.20 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రామాయంపేటలో రూ.200 కోట్లలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు విడతల్లో మంజూరైన 9,682 ఇందిరమ్మ ఇండ్లకు రూ.484 కోట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
త్వరలో విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు
విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో, రాందాస్ చౌరస్తాలో జరిగిన భగవాన్ విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశ్వకర్మల కోసం ఏటీసీల్లో కోర్సు ప్రారంభించాలని సిఫారసు చేస్తానని, రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.v
