హైదరాబాద్‌‌కు హార్వర్డ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ కోర్సులు..డిసెంబర్‌‌ నుంచే తరగతుల నిర్వహణ

హైదరాబాద్‌‌కు  హార్వర్డ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ కోర్సులు..డిసెంబర్‌‌ నుంచే తరగతుల నిర్వహణ
  •     యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్​ భేటీ 
  •     ఫ్యూచర్‌‌ సిటీలో  భారీ ఎడ్యుకేషన్‌‌ హబ్‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి 

హైదరాబాద్​, వెలుగు: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ఈ ఏడాది డిసెంబర్ నుంచే హైదరాబాద్‌‌లో ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌ హెచ్‌‌ఆర్‌‌డీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్‌‌ సహా దాదాపు 30 మంది బ్రిటీష్ విశ్వవిద్యాలయాల డీన్లు, ప్రతినిధులతో సీఎం ఉన్నత స్థాయి రౌండ్‌‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఐవీ లీగ్ విద్యాసంస్థలైన ఎంఐటీ, పర్డ్యూ తదితర వర్సిటీల ఆఫ్ షోర్ క్యాంపస్‌‌ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. 

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మేటి బిజినెస్ స్కూల్స్ తెలంగాణకు తరలివస్తే ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజాల చూపు మన వైపు పడుతుందని, విదేశీ వర్సిటీల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విదేశీ బిజినెస్ స్కూళ్ల రాకతో స్థానిక విద్యా సంస్థలతో కలసి విస్తృత పరిశోధనలు చేపట్టేందుకు అద్భుతమైన వేదిక లభిస్తుందని, మన విద్యార్థులు, అధ్యాపకులకు గ్లోబల్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ వర్సిటీ, వర్జీనియా టెక్, నార్త్‌‌ఈస్టర్న్ వంటి గ్లోబల్ వర్సిటీలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌‌లు, డ్యూయల్ డిగ్రీలు, రీసెర్చ్ భాగస్వామ్యాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కు రండి

స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌‌లో ఏటా నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలోనే ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు హాజరు కావాల్సిందిగా యూకే డెలిగేషన్ బృందాన్ని సీఎం ఆహ్వానించారు. మారుతున్న ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 30 వేల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్‌‌తో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.