సెప్టెంబర్ 17పై రాజకీయాలు చేస్తుండ్రు : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత

సెప్టెంబర్ 17పై రాజకీయాలు చేస్తుండ్రు : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
  • టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో విలీన దినోత్సవం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు ప్రతీక అయిన సెప్టెంబర్ 17పై కొందరు రాజకీయం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) చీఫ్ కవిత ఫైర్​అయ్యారు. గురువారం విలీన దినోత్సవం సందర్భంగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో ఆమె జెండాను ఎగురేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే విలీనం జరిగిందని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇది కేవలం హిందువులు చేసిన పోరాటమని బీజేపీ నాయకులు అబద్ధాలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయాలపై మేధావులు ఎంతో చైతన్యం తెచ్చారని, ఇప్పుడు మళ్లీ అలాంటి పోరాట పరిస్థితి వచ్చిందని పిలుపునిచ్చారు. 

ఆనాటి పోరాట కాలంలో బీజేపీ, ఆరెస్సెస్ జాడలే లేవని, వాటి ఆనవాళ్లే కనిపించలేదని కవిత స్పష్టం చేశారు. వట్టికోట ఆళ్వార్‌‌‌‌‌‌‌‌స్వామి, సురవరం ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి మహనీయులు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సైకిళ్లపై తిరుగుతూ ప్రజల్లో చైతన్యం నింపారని కొనియాడారు. ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను సంఘటితం చేశారని గుర్తుచేశారు. కాళోజీ, దాశరథి లాంటి కవులు, షోయబుల్లాఖాన్‌‌‌‌‌‌‌‌, మగ్దూం మొయినొద్దీన్‌‌‌‌‌‌‌‌ లాంటి యోధులు ప్రజల్లో తిరుగుబాటు తత్వాన్ని రగిలించారన్నారు. అప్పట్లో జాగీర్దార్లు, జమీందార్లపై సాగిన పోరాటంలో హిందువులు, ముస్లింలు అందరూ కలిసికట్టుగా పోరాడారని, అలాంటి చారిత్రక సత్యాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ‘విమోచన దినం’ అంటూ బీజేపీ చెబుతున్న పచ్చి అబద్ధాలను అందరం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.