బీఆర్ఎస్ లీడర్లకు వందల ఎకరాలు ఎట్లొచ్చినయ్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూ భాగోతంపై విచారణ జరపాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ లీడర్లకు వందల ఎకరాలు ఎట్లొచ్చినయ్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూ భాగోతంపై విచారణ జరపాలి  : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  కేసీఆర్ ఫాం హౌస్‌‌‌‌లో ఎస్సీ, అసైన్డ్ భూములున్నయ్
  •  తెలంగాణ ప్రయోజనాలు, నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టిన్రు

నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలు, నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, మాడుగులపల్లి మండలం చెరువుపల్లి చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బయటపెట్టిన బీఆర్ ఎస్ లీడర్ల భూ బాగోతం చూసి కండ్లు బైర్లు కమ్మాయన్నారు.

]కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావుకు వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరిపి, నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. గజ్వేల్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో 600 ఎకరాలు కబ్జాలో ఉందని ఆరోపించారు. పేదల భూములు గుంజుకొని తోటలు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు నిర్మించుకున్న ఘనత గత పాలకులదేనన్నారు. కేసీఆర్ గతంలో జగన్ కు బిర్యానీ పెట్టి, రోజా ఇంట్లో చేపల పులుసు తిని.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఏపీకి అప్పగించారని ఆరోపించారు. జగన్‌‌‌‌కు దాసోహమైనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌‌‌‌కు బుద్ధి చెప్పారన్నారు.

గుంటూరులో ఇంగ్లీష్ మీడియం చదువుకొని, నాలుగు ముక్కలు మాట్లాడితే నాయకుడు కాలేరని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌‌‌ ఏనాడైనా ప్రజా జీవితంలో ఉన్నాడా? ఏ ఒక్కరికైనా ఆపదొస్తే ఆదుకున్నాడా ? అని ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర కాదు కదా.. పొర్లు దండాలు పెట్టినా ప్రజలు పట్టించుకోరన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మొయినాబాద్‌‌‌‌లో 50 ఎకరాల ఫామ్‌‌‌‌హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

తన కండ్ల ముందే మోటార్ కిళ్లు, బస్సుల్లో తిరిగిన వ్యక్తులు.. పదేండ్లలో వేల కోట్లకు పడగలెత్తారన్నారు. ఎస్ఎల్‌‌‌‌బీసీని పూర్తి చేయడమే నా జీవితాశయం అని, పనులను త్వరగా పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని, మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌ను రాష్ట్రానికే రోల్ మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.