రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రాజెక్టులకు ఫండ్స్ ఇస్తున్నం
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : యువతకు ఉద్యోగాలు ఇప్పించడం తనకు ఫ్యాషన్ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. గురువారం యాదాద్రి, సూర్యాపేట కలెక్టరేట్లలో మీడియాతో మాట్లాడారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంత యువత మనోవేదనకు గురవుతున్నారని, అలాంటి వారికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే తాను మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించానని, ఈ నెల 19న కోదాడలో నిర్వహిస్తున్నామన్నారు. కోదాడలో నిర్వహించే మేళాలో 300 కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,500 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ... సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. యాదాద్రి జిల్లాలోని గంధమల్ల, బస్వాపూర్రిజర్వాయర్లకు ఇటీవల రూ. 336 కోట్లు రిలీజ్ చేసి నిర్వాసితులకు అందించామన్నారు.
అలాగే బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలకు రూ. 480 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. యాదాద్రి జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు, కాల్వలను మరో రెండేండ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. యాదాద్రిలో ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్భాస్కరరావు, ఎస్పీ ఆక్షాంక్ష్యాదవ్, అడిషనల్కలెక్టర్ వెంకారెడ్డి, సూర్యాపేటలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, ఏఎంసీ చైర్మన్ వేణారెడ్డి, సర్వోత్తమరెడ్డి పాల్గొన్నారు.
