- రచయితను ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘కల్పిత నాయకుడు’ (ఫ్యాబ్రికేటెడ్ లీడర్) పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పుస్తక రచయిత వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌ను ఇప్పటికే అరెస్టు చేసినందున ఆవిష్కరణకు అవకాశం లేదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు.
అంబేద్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలున్న పుస్తకావిష్కరణను అడ్డుకోవడంతోపాటు రచయితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎ.జ్ఞానచంద్రన్ మౌలి దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పుస్తక ప్రచురణకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రచయితను అరెస్టు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
