హైదరాబాద్, వెలుగు: నల్లగొండ జిల్లా వజీరాబాద్ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ఎం.ఉదయ్ గోపాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. రైతులకు పంట రుణాల మంజూరు, పంపిణీలో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2024–25 మధ్య 109 మంది రైతులకు రూ.2.10 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన రూపావత్ సైదానాయక్ మధ్యవర్తిగా వ్యవహరించి రైతుల నుంచి కమీషన్లు వసూలు చేసినట్లు ఆరోపించింది. ఇందులో బ్యాంకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు షేక్ ఖాదర్ మొయినుద్దీన్, ఇమ్రాన్ షేక్ సహకరించినట్లు పేర్కొంది.
సైదానాయక్ తన భార్య మంగమ్మ ఖాతా నుంచి ఉదయ్ గోపాల్, ఆయన భార్య కోమలదేవి ఖాతాలకు మొత్తం రూ.52.54 లక్షలు బదిలీ చేసినట్లు తెలిపింది. లంచంగా వసూలు చేసిన మొత్తాన్ని ఉదయ్ గోపాల్, సైదానాయక్ 70:30 నిష్పత్తిలో పంచుకున్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.
