హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌కు ఉన్న 450 ఎకరాలు, రేవంత్‌రెడ్డికి చెందిన 350 ఎకరాల భూ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘తెలంగాణ విలీనం – వాస్తవాలు – వక్రీకరణ’ సదస్సులో ఆయన మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం సాగిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతోందని ఆయన మండిపడ్డారు.
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. సాయుధ పోరాటం ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితం కాలేదని, అది కులాలు, మతాలకు అతీతంగా సాగిందని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర అంతా బ్రిటీషర్లకు, జమీందార్లకు అండగా ఉండటమేనని విమర్శించారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారనే భయంతోనే నాడు కాంగ్రెస్ పార్టీ నిజాంతో రాజీపడి విలీనం చేసిందని, ఆ తర్వాత అసలైన భూస్వాములే ఖద్దరు టోపీలు వేసుకుని చక్రం తిప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దశాబ్దాలు గడుస్తున్నా పేదల భూ సమస్యలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎం. వెంకటేశ్, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
