యాదాద్రి పవర్ ప్లాంట్ కు నైనీ బొగ్గు పెంపు! రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నుల రవాణా లక్ష్యంగా చర్యలు

యాదాద్రి  పవర్ ప్లాంట్ కు  నైనీ బొగ్గు పెంపు! రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నుల రవాణా లక్ష్యంగా చర్యలు
  •  సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలు
  • అంగూల్ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచన 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అతిపెద్ద యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు ఒడిశాలోని నైనీ నుంచి బొగ్గు సరఫరాను మరింత పెంచాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశించారు. ప్రస్తుతం నైనీ నుంచి రోజుకు సగటున సుమారు 2,100 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుండగా, దీనిని దశలవారీగా రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నుల స్థాయికి పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

గురువారం హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో సంస్థ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌‌‌‌మెంట్), ఒడిశాలోని నైనీ ఏరియా జీఎంతో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా పరిస్థితులపై సీఎండీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి ఏరియా జీఎంలను ఆదేశించారు.

రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నులు...

యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు నైనీ బొగ్గు సరఫరా పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, రవాణా ప్రక్రియలో ఎదురవుతున్న అవరోధాలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సీఎండీ ఆదేశించారు. బొగ్గు రవాణాను రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నుల స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని, రోడ్డు మార్గంలో బొగ్గు తరలింపునకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

రైల్వే సైడింగ్ వద్ద రైల్వే రేక్ లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నైనీ గని వద్ద రవాణాకు అవసరమైన మేర బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని నైనీ జీఎం శ్రీబైద్య సీఎండీకి వివరించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రాత్రి వేళల్లో లారీల ద్వారా బొగ్గును రైల్వే సైడింగ్‌‌‌‌లకు తరలిస్తున్నట్లు జీఎం తెలిపారు. దీనిపై స్పందించిన సీఎండీ, అందుబాటులో ఉన్న బొగ్గును సాధ్యమైనంత వేగంగా రైల్వే సైడింగ్‌‌‌‌లకు తరలించేందుకు లారీల సంఖ్యను పెంచాలని సూచించారు.

ఈ విషయంలో రాష్ట్ర జెన్ కో తో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న రవాణా ఏర్పాట్లు సరిపోని పక్షంలో అవసరమైన మేరకు కొత్త రవాణా కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడకుండా చూడటంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, కోల్​మూవ్​మెంట్​ఈడీ బి.వెంకన్న, కో ఆర్డినేషన్ అండ్​ మార్కెటింగ్ జీఎం టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.