తీర్పుల్లో రాజకీయ అంశాలను లేదా రాజకీయ విమర్శను న్యాయమూర్తులు చేయకూడదు. తీర్పు అనేది కేసులోని చట్టపరమైన అంశాలకి, కేసులోని విషయాలకు మాత్రమే పరిమితమై ఉండాలి. అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ నాయకులని కీర్తించడం వంటి విషయాలు తీర్పు ప్రధాన అంశం నుంచి దృష్టిని మళ్లిస్తాయి. న్యాయమూర్తులు రాజకీయంగా పూర్తిగా తటస్థంగా ఉండాలి. తీర్పులలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం వల్ల న్యాయస్థానం పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న భ్రమ ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంది.
హైకోర్టులు పలు తీర్పులలో అనవసర రాజకీయ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అత్యున్నత న్యాయస్థానం పలు సందర్భాలలో తప్పుపట్టి ఆ వ్యాఖ్యలను తీర్పుల నుంచి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తీర్పు అనేది చట్టానికి, కేసులోని విషయాలకు సంబంధించినది. అందుకని అందులో రాజకీయ వ్యాఖ్యలు ఉండకూడదు. చట్టబద్ధత, నిష్పాక్షికత, సంయమనం మాత్రమే ప్రాథమికంగా ఉండాలి.
ఈ మధ్యకాలంలో న్యాయమూర్తుల పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఓ జిల్లాకి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వస్తున్నారంటే రోడ్డువెంట ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. తీర్పులు ద్వారానే న్యాయమూర్తులు మాట్లాడాల్సి ఉంటుంది. భారత సుప్రీంకోర్టు ఆమోదించిన ‘రీ స్టేట్‌మెంట్ ఆఫ్ వ్యాల్యూస్ ఆఫ్ జ్యుడీషియల్ లైఫ్’ ప్రకారం న్యాయమూర్తులు వ్యక్తిగత ప్రచారం కోసంగానీ ఇతర కారణాలతోగానీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై, రాజకీయ అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యానించకూడదు.
పతాక శీర్షికల్లో న్యాయమూర్తి కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తే ఓడిపోయిన పక్షానికి న్యాయం జరగలేదనే అనుమానం కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే జిల్లా కోర్టు న్యాయమూర్తులలో కూడా ఈ ధోరణి ప్రబలుతోంది. అందుకు ఉదాహరణే రవికుమార్ దివాకర్ ఉదంతం. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పతాక శీర్షికల్లో కనిపించారు. సెప్టెంబర్ 7, 2026న వెలువరించిన ఓ తీర్పులో ఇలా వ్యాఖ్యానించారు. ‘పిరికివాడైన న్యాయమూర్తి అని అనిపించుకోవడం కంటే చనిపోవడం మేలు’ అని వ్యాఖ్యానించారు.
5 నెలల వ్యవధిలో 22 మరణశిక్షలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశంసించడం దగ్గర నుంచి, దాదాపు 5 నెలల వ్యవధిలో 22 మరణశిక్షలు విధించడం వరకు న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ పదేపదే వివాదాల కేంద్రంగా నిలిచారు. తన కోర్టు పరిధి నుంచి విచారణలో ఉన్న 97 తీవ్రమైన నేరాలు ఉన్న కేసులని ఉపసంహరించుకుంటూ జిల్లా సెషన్స్ జడ్జి తీసుకున్న పాలనాపరమైన చర్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తుంది.
సెప్టెంబర్ 7న ఆయన ఇచ్చిన తీర్పులో కూడా మరణశిక్ష విధించారు. అది ఆయన విధించిన 23వ మరణశిక్ష. దాదాపు గడిచిన ఐదు మాసాల్లో ఆయన 22 మరణశిక్షలను ఏప్రిల్ 26 నుంచి ఆగస్టు 2026 వరకు విధించారు. ముజఫర్ నగర్‌లోని షాహ్‌పూర్‌కు చెందిన నదీమ్‌కు ఆయన మరణశిక్షను విధించారు. అతను తన 23 సంవత్సరాల భార్య షాజాదీపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడని, ఆమె శరీరంలో 98 శాతం కాలిపోయిందని న్యాయమూర్తి దివాకర్ పేర్కొన్నారు.
జ్ఞానవాపి మసీదు కేసులో..
న్యాయమూర్తి దివాకర్ వారణాసిలో సివిల్ జడ్జిగా పనిచేశారు. అప్పుడు జ్ఞానవాపి మసీదు కేసులో కమిషన్ సర్వే సమయంలో శివలింగం దొరికిందని భావిస్తున్న ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆయన ఆదేశాలను జారీచేశారు. ఇది 2022లో జరిగింది. అప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఆయన పాత్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ కేసులో ఆదేశాలు జారీచేసిన తర్వాత తనకూ, తన కుటుంబానికి బెదిరింపులు, ఒత్తిళ్లూ వచ్చాయని తదుపరి జారీచేసిన ఉత్తర్వులలో ఆయన ప్రస్తావించారు. ఆయనకు బెదిరింపులు వస్తే పోలీసులకి, హైకోర్టుకి సమాచారం అందించాలి.
అంతేకానీ తదుపరి ఉత్తర్వులలో ఎలా పేర్కొన్నారో అర్థంకాని అంశం. ఇంకా ఇలా ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘నా కుటుంబంలోనూ, నాలోనూ మాటల్లో చెప్పలేనంత భయానక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులందరూ ఒకరి భద్రత గురించి మరొకరు ఆందోళన చెందుతున్నారు. ఇంటినుంచి బయటకు వెళ్లేముందు అనేకసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా నా వాళ్లు నా భద్రత గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. అంతేకాదు జ్ఞానవాపి కేసు విచారణకు సంబంధించి సాంఘిక మాధ్యమంలో తనను బెదిరించిన వ్యక్తిపై ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం కేసు నమోదు చేసిందని కూడా ఆయన తాజా తీర్పులో పేర్కొన్నారు.
యూపీ సీఎం యోగిపై ప్రశంసలు
అంతకుముందు 2024లో బరేల్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా జడ్జి దివాకర్ వార్తలలో నిలిచారు. 2010 నాటి బరేలీ అల్లర్లకు సంబంధించిన విచారణకు హాజరుకావాలని మౌలానా తాకిర్ రజాఖాన్‌కు సమన్లు జారీ చేస్తునప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని ప్రశంసించారు. ధార్మిక వ్యక్తి ఎలాఉండాలో యోగిని చూసి నేర్చుకోవాలని అన్నారు. ప్లేటో ప్రతిపాదించిన ‘తత్వవేత్త–రాజు’ భావనతో పోల్చుతూ జడ్జి దివాకర్ ఇలా వ్యాఖ్యానించారు. ‘అధికార పీఠంపై ఉన్న వ్యక్తి ధార్మిక భావాలు కలిగి ఉండాలి.
ఎందుకంటే ధార్మిక వ్యక్తి జీవితం భోగభాగ్యాల కోసం కాకుండా త్యాగం, అంకితభావంతో కూడి ఉంటుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ గోలక్‌నాథ్ ఆలయ పీఠాధిపతి ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మహంత్ బాబా యోగి ఆదిత్యనాథ్‌జీ. ఆయన ఈ భావనని నిజమని నిరూపించారు. అధికారం చేపట్టే వ్యక్తి ధార్మిక స్వభావం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్లేటో సూత్రీకరించిన తత్వవేత్త– రాజు పాలన గురించి ప్రస్తావించారు.
అక్కడితో ఊరుకోలేదు. జ్ఞానవాపి కేసులో ఇచ్చిన తీర్పులను అప్పటినుంచి తన కుటుంబం ఎదుర్కొన్న బెదిరింపులను ఆయన ప్రస్తావించారు. ఆ తరువాత 2024 మార్చి 19న అలహాబాద్ హైకోర్టు... న్యాయమూర్తి దివాకర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలను తొలగించింది. ఆ వ్యాఖ్యలు రాజకీయ ఛాయలు ఉన్నవిగా, వ్యక్తిగత అభిప్రాయాలతో కూడిన అనవసర వ్యాఖ్యలుగా కోర్టు అభివర్ణించింది.
వరుస మరణ శిక్షలు
ఏప్రిల్ 2026 నుంచి ఆగస్టు 2026 వరకు ఆయన 10 కేసుల్లో 22 మందికి మరణశిక్షలు విధించాడు. నదీమ్‌ది 23వ మరణశిక్ష. నదీమ్ కేసులో సుప్రీంకోర్టు మరణశిక్ష గురించి ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించారు. అది సరైందా కాదా అనే విషయాన్ని హైకోర్టు పరిశీలిస్తుంది. అయితే ఈ కేసులో ఆయన ఓ ప్రశ్నని దేశ ప్రజలకు సంధించారు. ఒక మహిళను సజీవ దహనం చేసిన వ్యక్తి పట్ల న్యాయస్థానం ఎలా వ్యవహరించాలి.
ఇటువంటి వ్యక్తి సానుభూతికి అర్హుడేనా? అని భారతదేశంలోని గొప్ప ప్రజలను అడగాలని అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. చివరికి అతను అర్హుడు కాదని చెబుతాడు. అంతేకాదు, అలహాబాద్ హైకోర్టు ఎన్‌కౌంటర్ల గురించి చేసిన తీర్పులకు విరుద్ధంగా ఆయన పరిశీలనలు ఉన్నాయి. తన కోర్టు నుంచి కేసులను ఎందుకు ఉపసంహరించారో తనకు తెలుసని కూడా ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి తన ఉత్తర్వులు ద్వారా మాట్లాడాలి. అదికూడా కేసు విషయాలకు సంబంధించి, న్యాయపరమైన విషయాలకు సంబంధించి మాత్రమే. అంతకుమించి కాదు. ఈ ధోరణులు ప్రబలకుండా ఎలాంటి చర్యలను పై కోర్టులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
-డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి(రిటైర్డ్)
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
