తెలంగాణ గడ్డ అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం. దశాబ్దాలపాటు దోపిడీదారుల చేతిలో చిన్నాభిన్నమైంది. ప్రత్యేక రాష్ట్రంలో ‘బంగారు తెలంగాణ’ అని నమ్మించి, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం, ప్రజల కష్టార్జితాన్ని, ప్రభుత్వ భూములను, పేదల ఆస్తులను ‘రాబంధువుల్లా’ ఎలా పీక్కుతిన్నదో అసెంబ్లీ వేదికగా బట్టబయలైంది. లక్ష కోట్ల భూకుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉరుములు ఉరిమిన తీరు చూస్తుంటే... ఈ నేల తల్లికి ఆయనే నిజమైన ముద్దుబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆస్తికి ఏకైక కాపలాదారుడిగా నిలిచారని యావత్ తెలంగాణకు తేటతెల్లమైంది.
మహా నాయకురాలు ఇందిరాగాంధీ పేదల కోసం ప్రవేశపెట్టిన భూసంస్కరణలతో, మన పోచంపల్లిలో మొదలైన భూదాన్ ఉద్యమంతో జమీందార్ల భూములు ప్రభుత్వానికి చేరి, పేదలకు సంక్రమించాయి. ఆ భూముల్లోకి మళ్లీ దొరలు, జమీందారులు అడ్డదారుల్లో కన్నేయకుండా అనేక చట్టాలతో ఆమె రక్షణ కల్పించారు. అందుకే ఆమె రాజ్యం ఇందిరమ్మ రాజ్యంగా పేదల గుండెల్లో నిలిచిపోయింది.
మా కాంగ్రెస్ పార్టీ అదే నమూనాను అనుసరిస్తూ వస్తుందనేది కాలం చెప్తున్న సత్యం. అయితే కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భూచట్టాలను సంస్కరిస్తూ వచ్చారు. 1999లో నిషేధిత జాబితాకు పునాదిపడితే, 2007లో కొత్త నిషేధ చట్టం వచ్చిందని సీఎం వివరించిన తీరుతో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ భూములకు సంబంధించిన ప్రభుత్వపాలనపై సంపూర్ణ అవగాహన వచ్చింది.
సీఎం వివరణతో స్పష్టత
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 'ధరణి' రూపంలో తెచ్చిన నల్లచట్టం పేదల భూములను కాపాడటానికి కాదు, తమ కుటుంబ బినామీల ఖాతాల్లోకి మార్చుకోవడానికే అని తేలిపోయింది. కేవలం 3 లక్షల73 వేల ఎకరాల చిల్లర మాత్రమే ప్రైవేట్ భూమి నిషేధితంలో ఉంటే.. ప్రతిపక్షాలు కోటి ఎకరాలు కాంగ్రెస్సే 22ఏలో పెట్టిందని ప్రజలను తప్పుదోవ పట్టించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 2025 అక్టోబర్ 27 నాటికి క్లియర్ డెడ్లైన్లో జాబితాలు సిద్ధంచేసి సబ్ రిజిస్ట్రార్లకు పంపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తీసుకొచ్చిన భూభారతి మరింత రక్షణలతో పేద, అణగారిన వర్గాలకు అండగా ఉండేలా తీర్చిదిద్దింది. అయితే డాటా ట్రాన్స్ ఫర్ క్రమంలో తలెత్తిన క్లరికల్ ఇబ్బందులు, గత మూణ్నాల్లుగా రిజిస్ట్రార్ల అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న తీరుతో ఈ సమస్య గత నెల రోజులుగా ఎందుకు పెరిగిందో సీఎం వివరించిన తీరుతో ఇందులో ప్రభుత్వ తప్పు ఎంతమాత్రం లేదని స్పష్టమైంది. 22ఏ భయాలతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సీఎం మాటలతో ఎంతో ఊరట కలిగింది.
కుటుంబ భూదాహం
ధరణి అనే డిజిటల్ వ్యవస్థ తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఉన్న రహస్య అజెండాను సీఎం బట్టబయలు చేశారు. లక్ష కోట్ల రూపాయల భూదందాను ఎలా సాగించారో, క్రైం ఎలా ప్లాన్ చేశారో వివరిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కుటుంబం భూదాహంపై అసహ్యం కలుగుతోంది. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం పండేది 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన చోట. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.
వీళ్ల కుటుంబంలోని వాళ్ల దగ్గరే నేరుగా 439.30 ఎకరాలు ఉన్నాయి ధరణి లొసుగులను అడ్డుపెట్టి టీఎం33 మాడ్యూల్ ద్వారా కంపెనీల పేరిట వందలాది ఎకరాలను మార్చేయడం, షాబాద్ మద్దూరులో ఇనాం భూముల దోపిడీ, ఎర్రబెల్లి, సుధీర్ రెడ్డి, సబితమ్మ బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాంతంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.. ఇలా ప్రతి ఒక్కరి బండారం బయటపడింది. ఒక్క మైహోమ్ కు శంషాబాద్ ఎయిర్‌పోర్టును ఆనుకొని 2,463 ఎకరాలు, మేళ్లచెర్వులో భూదాన్ భూములు దక్కడం వెనుక ఉన్న చీకటి కోణాలను ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది.
ఎవరు క్షమించాలి?
ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో నాటి కొమరం భీం మొదలు నిన్నటి మల్లు స్వరాజ్యం వరకూ ఏ నిజమైన ఉద్యమకారుడు కానీ, అతని కుటుంబం కానీ ఆర్థికంగా చితికిపోయినవారే, ఉద్యమాలతో వ్యక్తిగతంగా సర్వస్వం కోల్పోయినవారే. కానీ కేవలం ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఉద్యమం చేశామని చెబుతారు కదా.. కానీ వారు కోల్పోయింది కాదు, దోచుకుంది చెబుతోంది వాళ్లు ఏ ఉద్యమం చేశారో! ఎవరికోసం చేశారో అని సాక్ష్యాలతో వివరిస్తుంటే.. నాడు వీళ్ల స్వార్థంకోసం ఉసిగొల్పితే బలైన ఎంతోమంది ఆత్మఘోషలు నేడు అసెంబ్లీలో రేవంతన్న స్వరంతో మమేకమైనట్టుగా అన్పించింది. ఇంత ద్రోహం చేసి, కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని బూర్జువా మనస్తత్వంతో తరాల తమ కుటుంబాల కోసం తెలంగాణను దోపిడీ చేసిన వీళ్లను ఎవరు క్షమించాలి?
కాపలాదారుగా ప్రతిజ్ఞ
భూభారతి వచ్చేంతవరకూ బీఆర్ఎస్ బినామీల చేతుల్లోనే దొంగలు, స్కామర్లు ఉండె. బ్రిటీష్ ఐలాండ్ దీవిలో ఉన్న ధరణి సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించి వీటిని పూర్తిగా రూపురేఖలు లేకుండా చేసే అవకాశం వారికి ఉందని అందుకే ఆ అధికారాన్ని పూర్తిగా తొలగించి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీతో ‘భూభారతి’ రూపొందించాక వీళ్ల భరతం పడుతున్నానన్న సీఎం మాటలు విన్న ప్రజలు వాస్తవం గ్రహించారు.
ఒకవైపు ఇందిరమ్మ పార్టీ పేదలకు ఆస్తులు పంచుతుంటే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వాటిని సొంత కుటుంబానికి దోచుకుందని, అన్యాక్రాంతమైన ఇంచు భూమిని కూడా వదిలిపెట్టకుండా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిజ్ఞ ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రతిపక్ష నేతలు తన కళ్లలోకి చూడటానికి సైతం భయపడేలా ఆయన నిలదీసిన తీరు.. తెలంగాణ ఆస్తికి ఆయన నిజమైన కాపలాదారుడని మరోసారి రుజువు చేసింది.
-పున్నా కైలాస్ నేత,
డీసీసీ అధ్య క్షుడు నల్గొండ జిల్లా
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
