రూ.30.84 లక్షల జరిమానా కూడా
కొట్టాయం(కేరళ): అక్రమ ఆస్తుల కేసులో కేరళ మాజీ డీజీపీ టోమిన్ జె. థచంకరీకి కొట్టాయం విజిలెన్స్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30.84 లక్షల జరిమానా విధించింది. అవినీతి నిరోధక చట్టం కింద న్యాయమూర్తి కేవీ రజనీష్ గురువారం ఈ తీర్పు ఇచ్చారు. శిక్ష అమలులో భాగంగా థచంకరీని తిరువనంతపురంలోని పూజప్పుర సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. 2003 నుంచి 2007 మధ్య తన ఆదాయ వనరులతో పోలిస్తే 135.80% అధికంగా థచంకరీ ఆస్తులు కూడబెట్టినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ 96 మంది సాక్షులను విచారించింది. 271 పత్రాలను కోర్టు పరిశీలించింది. మరోవైపు డిఫెన్స్ తరఫున 23 మంది సాక్షులను విచారించడంతోపాటు 55 పత్రాలను రికార్డుల్లోకి తీసుకుంది. తుది విచారణ సందర్భంగా శిక్ష ఖరారు చేసేటప్పుడు తన అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని మాజీ డీజీపీ కోర్టును కోరారు. అయితే, ఆయన గతంలో నిర్వహించిన ఉన్నత స్థాయి పదవిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వెసులుబాటు ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. తీర్పుపై థచంకరీ కేరళ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పూజప్పుర సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ప్రాసిక్యూషన్ తరఫున విజిలెన్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.కె. శ్రీకాంత్ వాదించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఉన్నతాధికారి అక్రమంగా సంపద కూడబెట్టడం తీవ్రమైన నేరమన్నారు. తీర్పుపై కేసులో ఫిర్యాదుదారులు బాబీ కురువిల్లా, అలెగ్జాండర్ కురువిల్లా సంతృప్తి వ్యక్తం చేశారు.
