సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు పాలకులకెందుకు భయం? : కూనంనేని

సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు  పాలకులకెందుకు భయం? : కూనంనేని
  • సెప్టెంబర్ 17 పేరిట కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు: కూనంనేని 
  •     నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘పోరాట స్ఫూర్తి సభ’

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను గుర్తించడానికి, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి పాలకులకు ఎందుకు భయమని సీపీఐ నేతలు  ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తే కొందరు బాధపడతారని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలనే.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘పోరాట స్ఫూర్తి సభ’ నిర్వహించారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ విలీనానికి అసలైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు. సెప్టెంబర్ 17ను ‘స్వాతంత్య్ర దినోత్సవం’గా జరుపుకుంటుంటే.. కాంగ్రెస్ ‘ప్రజాపాలన’, బీఆర్ఎస్ ‘సమైక్యత’, బీజేపీ ‘విమోచన దినం’ పేరుతో సభలు పెట్టడం సిగ్గుచేటని కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు అసలు ఎక్కడి నుంచి ఏం విమోచనం చేశారు? అని నిలదీశారు. 

దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తుండడం హాస్యాస్పదం

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విలీనంపై గతంలో కేసీఆర్ వ్యవహరించిన తీరులోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో గానీ ఏనాడూ పాల్గొనని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు నేడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తుండడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ మండిపడ్డారు.  

చరిత్రతో సంబంధం లేని బీజేపీ.. దేశ ద్వితీయ పౌరుడైన ఉపరాష్ట్రపతితో బహిరంగ సభలో అబద్ధాలు చెప్పించే స్థాయికి దిగజారిందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలంటే పాఠ్యాంశాల్లో చేర్చాలని, ప్రత్యేకంగా ‘తెలంగాణ అమరవీరుల కార్పొరేషన్’ ఏర్పాటు చేయాలని సీపీఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఈ.టి. నరసింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎంపీ అజీజ్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, పార్టీ నేతలు పశ్య పద్మ, కలవేన శంకర్ తదితరులు పాల్గొన్నారు.