- బాధితులతో బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయించిన నిందితులు
- అకౌంట్ వివరాలు, పాసుబుక్స్, ఏటీఎం కార్డులను సైబర్ నేరగాళ్లకు చేరవేత
వరంగల్, వెలుగు : ముద్ర లోన్లు ఇప్పిస్తామంటూ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించి, వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న వ్యక్తులతో పాటు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత గురువారం మీడియాకు వెల్లడించారు. బ్యాంక్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసే రమేశ్ నాయక్, వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు కొందరు ఏజెంట్లను నియమించుకుని, పలువురికి రూ. 50 వేల ముద్ర లోన్లు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి డాక్యుమెంట్లు తీసుకొని హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయించారు.
ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రూ. 6 వేల నుంచి రూ.8 వేల వరకు కమీషన్ ఇచ్చేవాడు. ఇలా వందలాది మందికి చెందిన బ్యాంక్ పాస్ బుక్స్, ఏటీఎంలను తన వద్దే పెట్టుకొని వాటిని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, హర్యానా, ఛత్తీస్‍గఢ్ రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు అమ్మేసి వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకునేవారు. ఈ క్రమంలో డీసీసీ బ్యాంకులోని ఓ వ్యక్తి ఖాతా నుంచి అధిక మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన సిబ్బంది విషయాన్ని పోలీసులకు చెప్పారు.
ఈ విషయంపై ఎంక్వైరీకి సీపీ ఆదేశించడంతో సైబర్ క్రైం, టాస్క్ ఫోర్స్ టీమ్స్ రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. మ్యూల్ అకౌంట్ల దందా బయటపడింది. ఒక్కో అకౌంట్ నుంచి రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ దందాలో మొత్తం 26 మంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 22 మందిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి నుంచి 216 బ్యాంక్ పాస్ బుక్స్, 22 డెబిట్ కార్డులు, 8 చెక్ బుక్స్ తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన థర్డ్ పార్టీ బ్యాంకింగ్ కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
ఆయా బ్యాంక్ అకౌంట్లతో ఇప్పటికే 185 సైబర్ నేరాలు చేసినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకున్న ఏసీపీలు ఎం.వెంకటరమణ, మధుసూదన్, ఇన్ స్పెక్టర్లు అశోక్ కుమార్, నరేశ్, సుబ్బారెడ్డి, క్రాంతికుమార్, బండారి రాజు, విశ్వేశ్వర్, పెండ్యాల దేవేందర్, కె.స్వామితో పాటు ఇతర సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. సమావేశంలో డీసీపీ కవిత పాల్గొన్నారు.
