వెలుగు స్పెషల్ : మీడియాలో బహుజనులు ఎక్కడ?

వెలుగు స్పెషల్ : మీడియాలో బహుజనులు ఎక్కడ?

తెలుగు  రాష్ట్రాల్లో రాజకీయ చర్చ ఎక్కువగా కేసీఆర్, రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి,  కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి  వంటి  ప్రముఖ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది. వీరిలో మళ్లీ  ఎవరు అధికారంలోకి వస్తారు?,  ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?  ఎవరి  వ్యూహం విజయవంతమవుతుంది? అనే ప్రశ్నలకు  పత్రికల్లో  విస్తృత స్థానం లభిస్తోంది.  కానీ జనాభాలో  సగానికి పైగా ఉన్న బీసీలు  ఎన్ని  స్థానాలు పొందారు,   ఎన్ని బీసీ కులాలు  ఇప్పటికీ  శాసనసభలో అడుగుపెట్టలేదు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు వారి జనాభాకు తగిన  రాజకీయ  ప్రాతినిధ్యం ఉందా? అనే ప్రశ్నలు అంతే ప్రాధాన్యంతో ముందుకురావడం లేదు. రాజకీయ పోటీని విస్తృతంగా చూపిస్తున్న మీడియా, సామాజిక అధికార పంపిణీని మాత్రం ప్రధాన రాజకీయ ప్రమాణంగా మార్చలేకపోయింది.

మైనార్టీలుగా మెజారిటీ జనాభా

మీడియా యాజమాన్య సామాజిక నిర్మాణాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంది.   ప్రధాన పత్రికా సంస్థల చరిత్ర,  వాటి యాజమాన్యాలు,  వాటి రాజకీయ అనుబంధాలను పరిశీలించినప్పుడు కూడా కొద్దిమంది  ప్రభావశీల  కుటుంబాలు, వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకత్వాల  మధ్య  సన్నిహిత  సంబంధాలు  కనిపిస్తాయని  విమర్శకులు చెబుతున్నారు.  సమస్య  ఒక్కో విలేకరి ఏ కులానికి  చెందినవాడన్నది కాదు.  ఏ వర్గం పత్రికను నియంత్రిస్తోంది,  ఏ రాజకీయ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం  ఇస్తోంది,  ఏ సమస్య ప్రధాన శీర్షిక అవుతోంది,  ఏ సమస్య చిన్నవార్తగా మిగిలిపోతోంది అన్నదే అసలు పరిశీలించాల్సిన అంశం. 

ఇక్కడ ప్రధాన సమస్య పత్రికలు బహుజన సమస్యలను పూర్తిగా  విస్మరిస్తున్నాయన్నది కాదు.  బీసీ  మహాసభ జరిగితే  చిన్న వార్త వస్తుంది. దళితులపై దాడి జరిగితే చిన్న వార్త వస్తుంది. ఆదివాసీలు భూమి కోసం పోరాడితే  చిన్న వార్త వస్తుంది.  చేనేత కార్మికులు, మత్స్యకారులు, కుమ్మరులు, రజకులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, గౌడలు, యాదవులు, ఇతర వెనుకబడిన వర్గాల సమావేశాలకు కూడా కొంతస్థలం లభిస్తుంది. కానీ ఇవన్నీ విడివిడిగా  సామాజిక వార్తలుగానే  మిగిలిపోతున్నాయి. వాటన్నింటినీ కలిపి ‘మెజారిటీ జనాభా రాజకీయ అధికారంలో ఎందుకు మైనారిటీగా ఉంది?’ అనే ఒక సమగ్ర రాజకీయ ప్రశ్నగా పత్రికలు నిర్మించడం లేదు.

సామాజిక ప్రాతినిధ్య లెక్కలు ప్రజల ముందుంచాలి

ఎన్నికల ఫలితాలు  వచ్చినప్పుడు  ప్రతి పత్రిక పార్టీవారీగా స్థానాల లెక్కలు  ప్రచురిస్తోంది.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  ఎన్ని,  భారతీయ జనతా పార్టీ ఎన్ని,  భారత రాష్ట్ర సమితి ఎన్ని,  తెలుగుదేశం ఎన్ని,  వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎన్ని అనే లెక్కలు పెద్ద పట్టికలుగా వస్తాయి.  అదే పేజీలో..   బీసీలు జనాభాలో  ఎంత?,  గెలిచిన శాసన సభ్యులు ఎంత?,   ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఎంత?,   రెడ్డి, కమ్మ, వెలమ వర్గాల జనాభా ఎంత?  గెలిచిన స్థానాలు ఎంత? అనే సామాజిక లెక్కలు ఎందుకు ఉండకూడదు?  ఇటువంటి సామాజిక  ప్రాతినిధ్య లెక్కలు  నిరంతరం  ప్రజల ముందుకువస్తే  ఎన్నికల చర్చ పార్టీ  గెలుపోటముల నుంచి అధికార పంపిణీ వైపు మళ్లుతుంది.  

అప్పుడే  ప్రజాస్వామ్యానికి  నిజమైన  సామాజిక అర్థం కనిపిస్తుంది.  బహుజన రాజకీయాలను సంక్షేమ రాజకీయాలతో  సమానం చేయడం కూడా ప్రమాదకరం.  ఒక బీసీ కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వడం అవసరమే.  దళిత  కుటుంబానికి ఇల్లు ఇవ్వడం మంచిదే.  ఆదివాసీకి భూమి హక్కు కల్పించాలి.  ముస్లిం విద్యార్థికి  విద్యా సహాయం అందించాలి. కానీ ఇవన్నీ జరిగినంత మాత్రాన రాజకీయ సమానత్వం సాధించినట్లు కాదు.  సంక్షేమం ఒక కుటుంబాన్ని లబ్ధిదారునిగా చేస్తుంది.  రాజకీయ  ప్రాతినిధ్యం ఒక  సమాజాన్ని  నిర్ణయాధికారిగా మారుస్తుంది.  

పాలక సామాజిక నిర్మాణం మారాలి

తెలుగు రాష్ట్రాల్లో బలమైన,  బహుజన రాజకీయ కథనం ఇంకా రూపుదాల్చలేదు.  బహుజనులకు మరోపార్టీ మాత్రమే అవసరం కాదు.  తమ రాజకీయ పరిస్థితిని  ప్రతిరోజూ కొలిచే  స్వతంత్ర ప్రజామాధ్యమ దృష్టి కూడా అవసరం. జనాభా ఎంత?,   టికెట్లు ఎంత?,   శాసనసభ్యులు ఎంత?,   మంత్రులు ఎంతమంది?,   ఏ కులానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది?,   ఎన్ని కులాలకు  ఒక్కసారి కూడా శాసనసభ అవకాశం రాలేదు? వంటి ప్రశ్నలు నిరంతరం  ప్రజల ముందుకు రావాలి.   అప్పుడే  బీసీ, ఎస్సీ, ఎస్టీ,  ముస్లిం  సమస్యలు విడివిడిగా ఉన్న బాధల జాబితా నుంచి ఒక సమగ్ర రాజకీయ ప్రాతినిధ్య ఉద్యమంగా మారతాయి.  

అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజకీయ కథనం  బలహీనంగా ఉండటానికి మీడియా యాజమాన్య సామాజిక నిర్మాణం ఒక ముఖ్య కారణమని చెప్పాల్సిందే.  ప్రధాన పత్రికలు కమ్మ, రెడ్డి, వెలమ వంటి ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన లేదా వాటి రాజకీయ, ఆర్థిక శక్తి వలయాలకు  దగ్గరగా ఉన్నప్పుడు,  బహుజన సమస్యలు వార్తలుగా వచ్చినా, బహుజనుల అధికార హక్కు ప్రధాన సంపాదకీయ లక్ష్యంగా మారకపోవడం సహజమే.  అందుకే తెలుగు మీడియా ఇప్పటివరకు ఎక్కువగా ‘ఎవరు ముఖ్యమంత్రి కావాలి?’ అని అడిగింది.  ఇక బహుజన సమాజం అడగాల్సింది ‘ముఖ్యమంత్రి పదవులు, పార్టీ నాయకత్వం, శాసనాధికారం ఎందుకు పదేపదే  కొద్దిమంది సామాజిక వర్గాల మధ్యనే తిరుగుతున్నాయి?’ అని.

తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగం విస్తరించింది.  దినపత్రికలు పెరిగాయి,  వార్తా ప్రసార సంస్థలు పెరిగాయి, అంతర్జాల మాధ్యమాలు విస్తరించాయి.  సమాచారం ప్రజలకు వేగంగా చేరుతోంది.  కానీ ఈ విస్తరణకు తగినట్లుగా సామాజిక  వైవిధ్యం పత్రికల యాజమాన్యంలో,  సంపాదకీయ  నిర్ణయాల్లో,  రాజకీయ చర్చల్లో పెరిగిందా అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది.  బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కలిపి తెలుగు రాష్ట్రాల జనాభాలో అత్యధిక భాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, వారి రాజకీయ అధికార భాగస్వామ్యం  ప్రధాన పత్రికల రోజువారీ చర్చలో కేంద్ర అంశంగా కనిపించడం లేదు.  ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి. కానీ పాలక సామాజిక నిర్మాణం ఎంతవరకు మారుతోంది అనే ప్రశ్నను  పత్రికలు,  మీడియా ఎప్పుడూ అడగడం లేదు. 

- డా. జె. పూర్ణచంద్ర రావు, 
మాజీ డీజీపీ,  నేషనల్ కోఆర్డినేటర్  ఏఐబీఎస్‌‌‌‌‌‌‌‌పీ
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.