రైతులకు 40 నుంచి 90 శాతం వరకు సబ్సిడీలు ఇస్తున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు :రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగును ప్రోత్సహిస్తూ.. 2026–27లో అదనంగా 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైతులకు అవగాహన, శిక్షణతో పాటు రాయితీలు సైతం కల్పిస్తోంది.
రూ.1,000 కోట్లతో అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుని సుమారు రూ.1,000 కోట్లతో హార్టీకల్చర్ అభివృద్ధికి కార్యాచరణ చేపడుతున్నారు. సాగు విస్తరణతో పాటు నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలను సైతం దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. 2026–27లో మొక్కలు, మల్చింగ్, షేడ్‌నెట్, కోల్డ్ స్టోరేజీలు, హార్టీకల్చర్ యాంత్రీకరణ, శాశ్వత పందిళ్ల కోసం రూ.150 కోట్లు, బిందు–తుంపర సేద్యానికి రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించారు.
వివిధ ఉద్యాన వన పథకాల కింద అర్హతను బట్టి రైతులకు 40 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు రాయితీలు కల్పిస్తున్నారు. పాంపాండ్ల ఏర్పాటుకు సబ్సిడీతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా కూడా రైతులు చెరువులు తవ్వుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ప్రస్తుతం 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. 2026–27లో మరో 85 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులను ప్రోత్సహించేందుకు మొక్కలు, డ్రిప్, తొలి నాలుగేళ్ల ఎరువులు, అంతర పంటల సాగుకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు రూ.24,025 పలుకుతున్నాయి. సాగు విస్తరణకు అనుగుణంగా ప్రాసెసింగ్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు మిల్లులు పనిచేస్తుండగా, మరో ఆరు యూనిట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగిన ప్రాంతాల్లో భవిష్యత్‌లో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం
ఉద్యానవన పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఎగుమతి అవకాశాలను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్‌కు సమీప ప్రాంతాల్లో పండే ఉద్యాన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో బొప్పాయి మార్కెట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్కడ సాగు విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భవిష్యత్‌లో సాగు పెరిగి మార్కెట్ అవసరం ఏర్పడితే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను భవిష్యత్‌లో సోలార్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానించి ఉద్యానవన పంటల వైపు మళ్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
