- ఆ రెండు స్థానాల్లో పట్టభద్రులు మళ్లీ ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిందే!
హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలోని రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల రూప కల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌తో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాల ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చి నాటికి ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీని క్వాలిఫైయింగ్(అర్హత) తేదీగా పరిగణిస్తూ పూర్తిగా సరికొత్తగా ఓటర్ల జాబితాలు రూపొందించాలని ఎలక్షన్ సీఈఓ సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతమున్న ఓటర్ల జాబితాలను రద్దు చేస్తున్నందున, గతంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు కూడా తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలోని పేర్లను పరిగణనలోకి తీసుకోబోమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు సవరించిన ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత పత్రాల గెజిటెడ్ ధ్రువీకరణ ప్రతులను జతపరచాలని పేర్కొంది. పట్టభద్రులు తమ దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా క్షేత్రస్థాయి అధికారులకు స్వయంగా సమర్పించవచ్చని తెలిపింది.
నవంబర్ 6 వరకు దరఖాస్తులు..
ఓటర్ల నమోదు ఈ నెల 28న తొలి పబ్లిక్ నోటీసు జారీతో ప్రారంభమవుతుంది. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మాన్యుస్క్రిప్ట్‌లను సిద్ధం చేసిన అనంతరం నవంబర్ 25న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.
ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలన్నింటినీ డిసెంబర్ 25 నాటికి క్షేత్రస్థాయిలో పరిష్కరించి అనుబంధ జాబితాలను సిద్ధం చేస్తారు. అనంతరం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను లాంఛనంగా ప్రచురించనున్నారు. ఓటు నమోదుకు దరఖాస్తుదారులు సీఈఓ తెలంగాణ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించడంతో పాటు సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు పోస్టు ద్వారా లేదా నిర్దేశిత అధికారులకు నేరుగా అందించాలని అధికారులు సూచించారు.
