టాటా సన్స్ చైర్మన్‌‌‌‌గామళ్లీ చంద్రశేఖరనే!..ఐపీఓకి వెళ్లేందుకూ ఓకే

టాటా సన్స్ చైర్మన్‌‌‌‌గామళ్లీ చంద్రశేఖరనే!..ఐపీఓకి వెళ్లేందుకూ ఓకే
  • నోయెల్ టాటా  ఒప్పుకోకున్నా, ఆమోదం తెలిపిన కంపెనీ బోర్డ్‌‌‌‌
  • ఇది ఇల్లీగల్‌‌‌‌ అని పేర్కొన్నటాటా ట్రస్ట్స్‌‌‌‌
  • బోర్డు నిర్ణయం ఏజీఎంలో నిలబడదంటున్న ఎనలిస్టులు 

న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్‌‌, టాటా సన్స్‌‌‌‌ బోర్డు మధ్య వివాదం ముదిరింది. ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఒప్పుకోకున్నా,  టాటా సన్స్ చైర్మన్‌‌‌‌గా మరో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు ఎన్. చంద్రశేఖరన్‌‌‌‌కు  కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. మరో టర్మ్‌‌‌‌ కొనసాగబోనని చంద్రశేఖరన్ ఇప్పటికే ప్రకటించారని, తాజాగా తీసుకున్న నిర్ణయం ఇల్లీగల్ అని నోయెల్ టాటా పేర్కొన్నారు. కంపెనీని మార్కెట్‌‌లో లిస్ట్ చేయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. 

ఇతర మార్గాలను వెతకాలని చూస్తున్నారు.  ప్రస్తుతం టాటా సన్స్‌‌‌‌లో టాటా ట్రస్ట్స్‌‌‌‌కు 66 శాతం వాటా ఉండడంతో బోర్డు తీసుకున్న నిర్ణయం కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో వీగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలల లోపు.. అంటే సెప్టెంబర్ 30 లోపు ఏజీఎం నిర్వహించాలి.  దీనిపై టాటా సన్స్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. టాటా ట్రస్ట్స్‌‌‌‌పై ఒత్తిడి తెచ్చేందుకు టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. 

అసలేం జరిగిందంటే?

టాటా గ్రూప్ కంపెనీల పేరెంట్ కంపెనీ అయిన టాటా సన్స్ బోర్డు మీటింగ్ గురువారం  ముంబైలో దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌‌‌గా చంద్రశేఖరన్‌‌‌‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు బోర్డు మెజారిటీ ఓటుతో ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ (ఐపీఓ) చేసే ప్రక్రియను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. 63 ఏళ్ల చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. 

బోర్డులో ఏకాభిప్రాయం లేకపోవడంతో మూడోసారి పదవిలో కొనసాగేందుకు తాను ఆసక్తిగా లేనని ఆయన ఈ ఏడాది ఆగస్టులోనే స్పష్టం చేశారు. అయితే, తాజా బోర్డు సమావేశంలో డైరెక్టర్ల విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తర్వాత జరిగిన ఓటింగ్‌‌‌‌లో బోర్డు ఆయన నియామకాన్ని ఆమోదించింది. టాటా ట్రస్ట్‌‌‌‌లకు 66 శాతం వాటా ఉన్నప్పటికీ,  ఇవి నామినేట్  చేసిన డైరెక్టర్లు వేణు శ్రీనివాసన్ (టీవీఎస్ గ్రూప్) వంటి వారు చంద్రశేఖరన్‌‌‌‌ను కొనసాగించేందుకే ఓటు వేశారు. దీంతో బోర్డులో ఆయనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. 

 టాటా గ్రూప్ షేర్ల జోరు

టాటా సన్స్ చైర్మన్‌‌‌‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంతో పాటు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సన్స్ ఐపీఓ  సన్నాహాలకు బోర్డు ఆమోదం తెలపడంతో గ్రూప్ షేర్లు గురువారం భారీగా పుంజుకున్నాయి. టాటా సన్స్‌‌‌‌లో 2.53శాతం వాటా ఉన్న టాటా కెమికల్స్ ఏకంగా 14శాతం లాభపడి రూ.832 వద్దకు చేరగా, టాటా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కార్ప్ 6శాతం, టీసీఎస్  3శాతానికి పైగా పెరిగాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా ఎలెక్సీ షేర్లలోనూ భారీగా  కొనుగోళ్లు జరిగాయి.

రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌‌ విలువ

టాటా సన్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లు (సుమారు 230 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఇందులో కేవలం ఒక శాతం వాటాను విక్రయించినా రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు సమకూరుతాయి. ఇది జరిగితే భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా  కంపెనీ ఇష్యూ నిలుస్తుంది. 

తెరపైకి టాటా సన్స్‌‌‌‌ ఐపీఓ

తాజా మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ నిబంధనల ప్రకారం టాటా సన్స్ ‘అప్పర్ లేయర్’ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ పరిధిలోకి రావడంతో మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోపే లిస్టింగ్ జరగాలి. కానీ,  లిస్టింగ్‌‌‌‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్  తాను మార్కెట్‌‌‌‌ నుంచి తీసుకున్న  రూ.21 వేల కోట్ల అప్పులను తీర్చేస్తామని, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ హోదాను రద్దు చేయాలని ఆర్బీఐని కోరింది.  

అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఈ దరఖాస్తును తిరస్కరించడంతో  కంపెనీ తప్పనిసరిగా మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కావాలి. టాటా మోటార్స్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌, టాటా కెమికల్స్ వంటి చాలా కంపెనీలను మేనేజ్ చేస్తున్న టాటా సన్స్‌‌‌‌, మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కావడం ముఖ్యమని, అప్పుడే పారదర్శకత ఉంటుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ భావిస్తోంది. కచ్చితంగా ఐపీఓకి వెళ్లాల్సి ఉండడంతో మేనేజ్‌‌‌‌మెంట్ స్థిరంగా ఉందనే నమ్మకం ఇన్వెస్టర్లలో కలిపించడం ముఖ్యం. దీంతో  సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా టాటా గ్రూప్‌‌‌‌ను నడిపిన చంద్రశేఖరన్‌‌‌‌ను కొనసాగించాలని టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది.