- కల్వకుంట్ల కుటుంబం భూ కబ్జాలను తేల్చేందుకే వెళ్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సిద్దిపేటలో పర్యటించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఈ బృందం బయలుదేరనుంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ టూర్‌కు దూరంగా ఉన్నారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలంతా ఈ పర్యటనకు రావాలని సీఎల్పీ నుంచి ఫోన్‌ల ద్వారా సమాచారం వెళ్లడంతో అందరూ సిద్ధమయ్యారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన భూ కబ్జాలపై పూర్తి నిజాలను నిగ్గుతేల్చేందుకే తాము ఈ టూర్‌కు వెళ్తున్నట్లు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ గురువారం గాంధీభవన్, సీఎల్పీలో జరిగిన వేర్వేరు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు బయటపెట్టిన ఆస్తులు ఉల్లిగడ్డ పొట్టు లాంటివని, ఈ ఎపిసోడ్‌లో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని విప్ బల్మూరి వెంకట్ అన్నారు.
కల్వకుంట్ల కుటుంబం దళిత, అసైన్డ్, దేవాదాయ భూములతో పాటు కాందిశీకుల భూములను కూడా వదలకుండా కబ్జా చేసిందని విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగే విచారణలో కాంగ్రెస్ ఎంపీలమంతా పాల్గొంటామని చెప్పారు. వెంకటాపురం-ఎర్రవల్లి మధ్య కేసీఆర్ కబ్జా చేసిన 300 ఎకరాల భూముల రికార్డులను పరిశీలిస్తామని తెలిపారు. "ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములు మీ తాతలు రాసిచ్చారా?" అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చామల సూటిగా నిలదీశారు. జన్వాడలో ఈడీ అటాచ్ చేసిన భూములు, సత్యం రామలింగరాజుకు చెందిన 111 జీవో భూములు కేటీఆర్ పేరు మీదకు ఎలా మారాయో బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో తెలంగాణ భూములను కబ్జా చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని ఎంపీ మల్లు రవి విమర్శించారు.
