భద్రాచలం, పటాన్‌చెరు, కింగ్‌కోఠి దవాఖానల్లో 36 సీట్లకు దరఖాస్తు
ఇప్పటికే తనిఖీలు పూర్తి చేసిన ఎన్‌ఎంసీ బృందాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషాలిటీ వైద్య సేవలను క్షేత్రస్థాయికి విస్తరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. సాధారణంగా ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాతే పీజీ కోర్సులు ప్రారంభించే పాత విధానానికి భిన్నంగా, నేరుగా ఏరియా, జిల్లా హాస్పిటల్స్‌లోనే స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా భద్రాచలం, పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్స్‌తోపాటు హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి జిల్లా హాస్పిటల్‌లోనూ ఈ పీజీ సెంటర్లను ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు చేసింది. ఈ మూడు దవాఖానల్లో ఒక్కోదానికి 12 చొప్పున మొత్తం 36 పీజీ సీట్ల కేటాయింపునకు ప్రతిపాదించింది.
ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తి..
స్టాండ్ అలోన్ పీజీ అనుమతుల కోసం ఎన్‌ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. హాస్పిటల్‌లో కనీసం 220 నుంచి 300 బెడ్లు ఉండటంతోపాటు 75 శాతం పైగా ఆక్యుపెన్సీ, నిరంతర పేషెంట్ల రద్దీ ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్లు, ప్రొఫెసర్లతోపాటు 24 గంటల బ్లడ్ బ్యాంక్, వెంటిలేటర్ ఐసీయూలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక డయాగ్నోస్టిక్ వసతులు తప్పనిసరి. ఈ ప్రమాణాల ఆధారంగా ఎన్‌ఎంసీ ప్రత్యేక బృందాలు ఇప్పటికే భద్రాచలం, పటాన్‌చెరు, కింగ్‌కోఠి దవాఖానల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, బెడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. తుది అనుమతులు లభిస్తే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభంకానున్నాయి.
తక్కువ ఖర్చుతో పీజీ విద్య..
సాధారణ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వందల కోట్ల నిధులు, పదుల ఎకరాల భూమి, ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం అనాటమీ, బయోకెమిస్ట్రీ లాంటి ప్రీ-క్లినికల్ ల్యాబ్‌లు, హాస్టల్ బిల్డింగ్స్ అవసరమవుతాయి. అయితే, స్టాండ్ అలోన్ విధానంలో ఎంబీబీఎస్ కోర్సు ఉండదు. ఇప్పటికే భారీగా రోగులు వచ్చే ప్రధాన హాస్పిటల్స్‌ను నేరుగా పీజీ టీచింగ్ సెంటర్లుగా మారుస్తారు. కేవలం రోగులకు చికిత్స అందించే క్లినికల్ డిపార్ట్‌మెంట్‌లలో పీజీ వైద్య విద్యను అందిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి కొత్త భవనాలు, భూసేకరణ భారం తప్పడమే కాకుండా, అతి తక్కువ ఖర్చుతో స్వల్ప వ్యవధిలోనే స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది.
గ్రామీణ ప్రాంతాలకూ స్పెషలిస్టు సేవలు..
ఈ పీజీ కాలేజీల ఏర్పాటుతో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీరనుంది. రౌండ్ ది క్లాక్ సేవలందించే పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు అందుబాటులోకి రావడంతో అర్ధరాత్రి వేళల్లోనూ ఎమర్జెన్సీ చికిత్సలు అందనున్నాయి. ముఖ్యంగా భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నపాటి సమస్య వచ్చినా ఖమ్మం లేదా హైదరాబాద్‌కి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. స్థానికంగానే సిటీ స్కాన్, వెంటిలేటర్, ఐసీయూ సేవలు దక్కడంతోపాటు సిటీలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్స్‌పై పేషెంట్ల ఒత్తిడి తగ్గనుంది.
