- ఆగస్టు 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 17 అంతే పవిత్రం
- ఎంఐఎంకు భయపడే చరిత్రను తొక్కిపెట్టే కుట్ర అని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: దేశానికి ఆగస్టు15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణకు సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ, రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ సమాజానికి ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో.. సెప్టెంబర్ 17 కూడా అంతే పవిత్రమైన, చారిత్రాత్మకమైన పండుగ రోజని పేర్కొన్నారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి.. తెలంగాణ సమాజం గర్వంగా జరుపుకోవాల్సిన సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినం అని పిలవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు వణికిపోతున్నాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశంలోని 550కిపైగా సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారత నిర్మాణాన్ని పూర్తి చేశారని కొనియాడారు. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని, కుదరకపోతే పాకిస్తాన్‌లో కలపాలనే కుట్రతో ‘ఉస్మానిస్తాన్’ పేరిట నిజాం దురాగతాలకు ఒడిగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. .
మజ్లిస్‌కు భయపడి పేర్లు మారుస్తారా?
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ దశాబ్దాలుగా పోరాడుతోందని రాంచందర్ రావు తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. గద్దెనెక్కాక మజ్లిస్‌కి భయపడి మాట తప్పారని విమర్శించారు. నిజాం పాలన కింద ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విమోచన దినాన్ని ఘనంగా జరుపుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని చెప్పారు. కేంద్రంలోని మోదీ సర్కార్ 2022 నుంచి ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టాకే.. బీఆర్ఎస్ సమైక్యతా దినం అని, నేటి కాంగ్రెస్ ప్రజా పాలన దినం అని పేర్లు మార్చి నాటకాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణత్యాగాలను కేవలం ‘విలీనం’ అనే పదంతో కుదించి అవమానించవద్దని రాంచందర్ రావు హితవు పలికారు.
