ట్రంప్ పేరు కూడా చేరుస్తరేమో..! దిశా సాలియన్ కేసుపై ఉద్ధవ్ థాక్రే సెటైర్

ట్రంప్ పేరు కూడా చేరుస్తరేమో..! దిశా సాలియన్  కేసుపై ఉద్ధవ్ థాక్రే సెటైర్
  • ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి 

శంభాజీనగర్ (మహారాష్ట్ర): దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌‌‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో తన కుమారుడు ఆదిత్య పేరును చేర్చడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శంభాజీనగర్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.  

"ఈ ఘటన అత్యంత బాధాకరమైనదే కానీ, మాపై ఎందుకు బురదజల్లుతున్నారు? ఇది పూర్తిగా కుట్రపూరితం. రేపు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ పేర్లను కూడా ఇందులో లాగుతారేమో" అని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణ పేరుతో క్యారెక్టర్ అసాసినేషన్‌‌‌‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దిశా సాలియన్‌‌‌‌ను తామెప్పుడూ కలవలేదని తేల్చిచెప్పారు. 

ఆదిత్య కూడా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఈ కేసును రాజకీయ ప్రేరేపితంగా చిత్రీకరిస్తున్నారంటూ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్.. ఆదిత్య థాక్రే, అనిల్ దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌లపై 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నోటీసులు పంపారు.