వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్ రష్యా శాంక్షన్స్ బిల్లు అమల్లోకి వస్తే వాణిజ్య, ఆర్థిక పరమైన ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. దీని కోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను వివిధ దేశాల నుంచి సేకరిస్తామని వివరిస్తూ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది.
రష్యాతో భారత్ జరుపుతున్న క్రూడాయిల్ వ్యాపారం గురించి, దానివల్ల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ మార్కెట్‌పై పడే ప్రభావాల గురించి అమెరికా ప్రతినిధులకు గతంలోనే స్పష్టంగా తెలియజేసినట్టు మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతీయ వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తామని వెల్లడించింది.
ఆంక్షల ముప్పును ఎదుర్కొనేందుకు రిఫైనరీలు సిద్ధం రష్యా ఆర్థిక వనరుల కట్టడి ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ దేశం ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధాన్ని ఆపేసేలా చేయాలనే లక్ష్యంతో అమెరికా ఈ బిల్లును తీసుకొచ్చింది. రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన రంగాలు, మాస్కో సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలను ఇది లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మాస్కో నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాలపై 100% వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కట్టబెడుతోంది.
