ప్రపంచ మార్కెట్లకు.. మన సెమీకండక్టర్ చిప్స్

ప్రపంచ మార్కెట్లకు.. మన సెమీకండక్టర్ చిప్స్
  • సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తం: మోదీ 
  • ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2026 సమిట్​ ప్రారంభం
  • 600లకు పైగా ప్రముఖ కంపెనీల అధిపతులు అటెండ్
  • ఈ సమిట్ నుంచే సీడీఐఎల్, సుచి సెమికాన్ యూనిట్లు ఓపెన్ 

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌లో తయారయ్యే సెమీకండక్టర్ చిప్‌‌‌‌లను ఇకపై ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశోధనలను మన దేశంలోనే కేంద్రీకరించాలని కంపెనీలను కోరారు. భారత్‌‌‌‌లో చిప్స్ తయారీ వేగం ఇతర దేశాల కంటే చాలా ఎక్కువని ప్రశంసించారు. 

గురువారం ఢిల్లీలోని యశోభూమిలో ‘సెమికాన్ ఇండియా 2026’ సదస్సు ప్రారంభమైంది. ఈ సమిట్​లో ప్రధాని మోదీ పంజాబ్​లోని మోహాలీలో ఉన్న సీడీఐఎల్ (కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), గుజరాత్‌‌‌‌లోని పాల్సానాలో ఉన్న సుచి సెమికాన్ యూనిట్లలో కమర్షియల్ ప్రొడక్షన్​ను వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి చెందడానికి దశాబ్దాల టైంపట్టింది. కానీ భారత్ అతి తక్కువ కాలంలోనే ఈ రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. 

తయారీతో పాటు స్వదేశీ డిజైన్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ(ఐపీ) భారత్‌‌‌‌లోనే ఉండాలి. దీనికోసం చిప్స్ డిజైన్ చేసి తయారీని ఔట్‌‌‌‌సోర్స్ చేసే సంస్థలు దేశంలో మరింతగా ఎదగాల్సిన అవసరం ఉంది. అలాగే, పరిశ్రమలు ప్రభుత్వం ఇస్తున్న  ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిశోధనలను ఇక్కడే కేంద్రీకరించాలి. ఏఐని విస్తృతంగా వాడటం వల్ల కంప్యూటర్లు, సర్వర్లు, డేటా సెంటర్లు నిరంతరం పనిచేయాల్సి వస్తున్నది. 

దీనివల్ల కరెంట్ ఎక్కువగా అవసరం పడుతోంది. ఇలా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌‌‌‌ను తీర్చడం కోసం, అలాగే కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం భారత్ సాంప్రదాయ విద్యుత్ పద్ధతులకు బదులుగా సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గతంతో పోలిస్తే ఎక్కువ శాతం పెంచింది. సోలార్ ప్లాంట్ల ద్వారానే ఎక్కువ కరెంట్‌‌‌‌ను ఉత్పత్తి చేసే ఏర్పాట్లు చేసుకున్నాం’ అని మోదీ చెప్పారు.  దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెంచామని ప్రధాని గుర్తుచేశారు.

సదస్సుకు 52 దేశాల నుంచి 600ల కంపెనీలు 

మూడు రోజుల పాటు జరుగనున్నఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల నుంచి 600లకు పైగా ప్రముఖ కంపెనీలు, వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మైక్రాన్, ఇంటెల్, ఏఎండీ, ఏఎస్‌‌‌‌ఎంఎల్, అప్లైడ్ మెటీరియల్స్, ఇన్ఫినియన్, టోక్యో ఎలక్ట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీల అధిపతులు అటెండ్ అయ్యారు. ఇది భారతదేశంపై అంతర్జాతీయ మార్కెట్ ఉంచిన అపారమైన నమ్మకానికి నిదర్శనంగా నిలిచిందని మోదీ తెలిపారు. 

దేశం జీడీపీ వృద్ధిని, ఇటీవలి కాలంలో విజయవంతంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌‌‌‌టెక్ ఫెస్ట్‌‌‌‌ను ప్రస్తావిస్తూ.. భారత్ అన్నిరంగాల్లోనూ దూసుకుపోతూ గ్లోబల్ ఎకానమీలో కీలక శక్తిగా మారుతోందని మోదీ పేర్కొన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్​లో భాగంగా డిసెంబర్ 2021లో రూ. 76 వేల కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌తో మొదటి దశను ప్రారంభించిన కేంద్రం.. ఇప్పుడు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ ద్వారా సప్లయ్ చైన్, నైపుణ్యాభివృద్ధి, పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. 

సీడీఐఎల్ మోహాలీలో అత్యాధునిక అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయగా... సుచి సెమికాన్ గుజరాత్‌‌‌‌లో అవుట్‌‌‌‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) యూనిట్‌‌‌‌ను ప్రారంభించి దేశీయ చిప్ తయారీకి పటిష్టమైన పునాది వేసింది.