అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి పక్కా ఇల్లు.. రైతుల ఆదాయం పెంచేందుకు సమగ్ర రోడ్‌‌ మ్యాప్ రూపొందిస్తున్నం

అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి పక్కా ఇల్లు.. రైతుల ఆదాయం పెంచేందుకు సమగ్ర రోడ్‌‌ మ్యాప్ రూపొందిస్తున్నం
  • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్
  • తిమ్మాపూర్ లో రైతులు, మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి

ఇబ్రహీంపట్నం, వెలుగు: పేదలకు సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను సమర్థంగా అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 

గురువారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సంధర్భంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో రైతులు, మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్‌‌నాథ్ ఠాకూర్ తో కలిసి హాజరయ్యారు. ప్రజలకు విశ్వకర్మ జయంతి, హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

గ్రామంలో రజాకార్ల దాడుల నుంచి రక్షణ పొందేందుకు గ్రామస్తులు నిర్మించిన బురుజును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. లఖ్‌‌పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల ఆదాయం పెంచేందుకు సమగ్ర రోడ్‌‌ మ్యాప్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, రహదారుల నిర్మాణానికి, రైతులకు ఆర్థిక సహాయానికి, స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, సర్పంచ్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. 

వికసిత్ భారత్ లక్ష్యానికి సహకరిచండి : ఎంపీ అరుణ

షాద్ నగర్ :    షాద్​నగర్ ​ మినీ స్టేడియంలో గురువారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలను పాలమూరు ఎంపీ డీకే అరుణ పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. తహసీల్దార్ నాగయ్య, నాయకులు అందె బాబయ్య, మోహన్ సింగ్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఇన్నతి శ్రీనివాస్, వంశీ  పాల్గొన్నారు.