- మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన వారు
- స్టూడెంట్ల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి
- మృతుల ఫ్యామిలీలకు రూ.2 లక్షల పరిహారం : మంత్రి వివేక్
సంగారెడ్డి/పటాన్‌చెరు/హైదరాబాద్, వెలుగు : వినాయక నిమజ్జనం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఆరుగురు స్టూడెంట్లు చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దకంజర్ల శివనగర్ చౌరస్తాలోని శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ కు చెందిన నర్సింహారాజు (20), సుమంత్ (18), గణేశ్(18), ఉదయ్ కిరణ్ (19), శ్యామ్ కుమార్ (17), సిద్దార్థ్ (15) కలిసి బుధవారం సాయంత్రం వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు స్థానిక నేరేడు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి నిమజ్జనం చేస్తుండగా.. లోతు ఎక్కువగా ఉండడం, బురద ఉండడంతో నీటిలో పడిపోగా... ఈత రాకపోవడంతో అందరూ మునిగిపోయారు.
విషయం తెలుసుకున్న పటాన్ చెరు పోలీసులు, ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని చెరువులో గాలింపు చేపట్టగా.. ఆరుగురి డెడ్ బాడీలు దొరికాయి. డెడ్ బాడీలను బయటకు తీసి గ్లోబల్ ప్రాచీన్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాస్పిటల్ కు వెళ్లి స్టూడెండ్ల మృతదేహాల వద్ద నివాళులర్పించారు. ట్రస్ట్ లో ఉంటున్న ఆరుగురు స్టూడెంట్స్ చనిపోవడంతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.
సీఎం దిగ్ర్భాంతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్‌వెంకటస్వామి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు స్టూడెంట్లు చనిపోయిన ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో స్టూడెంట్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల వద్ద భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
