ఫంక్షన్లో మిగిలిన బిర్యానీని స్కూల్కు తీసుకొచ్చిన టీచర్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ఫంక్షన్లో మిగిలిన బిర్యానీని స్కూల్కు తీసుకొచ్చిన టీచర్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత
  • ఫంక్షన్ లో మిగిలిన బిర్యానీని స్కూల్ కు తీసుకొచ్చిన టీచర్
  • తిన్న వెంటనే అస్వస్థతకు గురైన స్టూడెంట్లు
  • సంగారెడ్డి జిల్లా పెద్దలోడి జడ్పీహెచ్ఎస్ లో ఘటన
  • టీచర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

మునిపల్లి, వెలుగు : ఓ టీచర్ తన ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా మిగిలిన బిర్యానీని స్కూల్ కు తీసుకురాగా.. దానిని తిన్న స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ లో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దలోడి జడ్పీహెచ్ఎస్ కు చెందిన సోషల్ టీచర్ వెంకటేశం ఇంట్లో బుధవారం ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా మిగిలిన బిర్యానీని ప్యాక్ చేసి గురువారం స్కూల్ కు తీసుకొచ్చాడు. ఉదయం 11 గంటలకు స్టూడెంట్లు బిర్యానీని తిన్నారు. కొద్దిసేపటి తర్వాత 40 విద్యార్థులు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన టీచర్ స్పృహ తప్పి పడిపోయారు.

గమనించిన స్కూల్ సిబ్బంది స్టూడెంట్లను, టీచర్ ను సదాశివపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని సంగారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లకు ఫోన్ చేసి స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించాలని ఆదేశించారు. డీఈవో రోహిణి, ఎంఈవో భీంసింగ్‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌ రంగారావు, ఎంపీడీఓ అంజయ్య, మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షీ సాయికుమార్‌‌‌‌, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్రాములు, సర్పంచ్ లు రాజు, ఆనంద్‌‌‌‌, సీపీఎం మండల నాయకుడు రమేశ్ గౌడ్ సంగారెడ్డి, సదాశివపేట హాస్పిటల్స్ కు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 

టీచర్ సస్పెన్షన్

టీచర్ వెంకటేశం స్కూల్ కు తీసుకొచ్చిన బిర్యానీ తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విచారణలో తేలింది. దీంతో వెంకటేశంను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.