- 388 ఎకరాల సర్కారు జాగాపై అసెంబ్లీలో సీఎం ప్రకటన తర్వాత రంగంలోకి
- 325 సర్వే నంబర్‌లో భూములపై ఆరా
- పాత రికార్డులు.. లావణి పట్టాల పరిశీలన
- త్వరలో కేసీఆర్ సహా రైతులకు నోటీసులు
సిద్దిపేట/ ములుగు, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిధిలో భూముల లెక్క తేల్చడంపై దృష్టి సారించారు. సర్వే నంబర్ 325లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ సీఎం కేసీఆర్.. తన ఫాంహౌస్భూముల్లో కలిపేసుకున్నారని, సర్వే ద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేద దళితులకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్వే నంబర్325లోని 388 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో 30 రోజుల్లో తేల్చాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా రెవెన్యూ యంత్రాంగం గురువారం రంగంలోకి దిగింది.
అసైన్డ్ భూముల్లో ఉన్నవారి వివరాల సేకరణ
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి శివారు, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల సరిహద్దుల్లోని 325 సర్వే నంబర్‌లో ఉన్న అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. అంతకుముందు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ సరిత, సర్వే ల్యాండ్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) సుదర్శన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (డీఐ) సేవియా నాయక్, వంశీ ఆధ్వర్యంలో మర్కూక్ తహసీల్దార్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రవల్లి భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ పరిశీలించారు. ఆ తర్వాత ఎర్రవల్లి చేరుకొని 325 సర్వే నంబర్‌లోని అసైన్డ్ భూముల్లో ప్రస్తుతం ఎవరెవరు కబ్జాలో ఉన్నారనే వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు వారి దగ్గరకొచ్చి ‘మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించారు. వారికి రెవెన్యూ అధికారులెవరూ సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా 325 సర్వే నంబర్‌లోని భూమికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని కొందరు రైతులు అన్నారు. కాగా, మూడు గ్రామాల సరిహద్దులో సర్వే నంబర్ 325 హద్దులు, పాత రెవెన్యూ రికార్డులు, ఎవరి పేరు మీద లావాణీ పట్టాలయ్యాయి? లాంటివివరాలను మరోసారి పాత రికార్డులతో సరిపోల్చి చూస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ సహా చుట్టుపక్కల రైతులందరికీ నోటీసులు ఇచ్చి సర్వే చేపట్టి, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
