- సదరన్ డిస్కం పరిధిలో 47,854 మండపాలు
- గతేడాది కంటే పెరిగిన లోడ్
- రూ.16.54 కోట్లు భరిస్తున్న రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు:క్యూర్ పరిధిలోని హైదరాబాద్మెగా సిటీతో పాటు సదరన్ డిస్కంపరిధిలో 47,854 గణేశ్ మండపాలను ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి రోజు 104 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతున్నట్లు డిస్కం ఆఫీసర్లు ప్రకటించారు. ఈ డిస్కం పరిధిలో గతేడాది కంటే కరెంట్ లోడ్ పెరిగిందని తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈ నెల14 నుంచి 25 వరకు జరిగే వినాయక ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వాహకులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ వినియోగానికి సంబంధించిన చార్జీలు, స్థిర చార్జీల పేరిట రూ.16.54 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది.
47,854 వినాయక మండపాలు..
టీజీ ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు ఎస్ఏఎస్ఏ యాప్ ద్వారా నమోదు చేసిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు డిస్కంపరిధిలో మొత్తం 47,854 వినాయక మండపాలు నమోదయ్యాయి. ఇందులో 7 అడుగుల లోపు ఎత్తున్న మండపాలు 20, 293 ఉండగా, ఏడు నుంచి 14 అడుగుల మధ్య ఎత్తు ఉన్నవి 24, 908 కాగా, 14 నుంచి 20 అడుగుల మధ్య ఎత్తు ఉన్నవి 2,043 కాగా 20 అడుగులకు పైగా ఎత్తు ఉన్న మండపాలు 610 ఉన్నట్లుగా డిస్కంఇంజినీర్లు ప్రకటించారు. వీటన్నింటికి కలిపి 1,04626 కిలోవాట్ల (104.62 మెగావాట్ల) కనెక్టెడ్ లోడ్ నమోదైనట్లు తెలిపారు.
ప్రత్యేక భద్రతా చర్యలు
వినాయక ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం టీజీ ఎస్పీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అన్ని సర్కిళ్లలో ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. మండపాల వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ, పండుగల నిర్వహణలో ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోంది.
దరన్ డిస్కంపరిధిలో గత ఏడాది 47,649 వినాయక మండపాలు ఏర్పాటు చేయగా, 98.62 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. రూ.15.59 కోట్ల వ్యయమైంది. ఈ ఏడాది 47,854 మండపాలు ఏర్పాటు చేయగా, 104.62 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని అంచనా. ఇందుకోసం ప్రభుత్వం16.54 కోట్లు భరిస్తోంది.
