- ఎన్ఎఫ్సీ నుంచి చెక్‌పోస్ట్ వరకుఒకే ఎలివేటెడ్ కారిడార్
- వన్‌వే తో ట్రాఫిక్ సమస్య తీరడంతో రీ అలైన్‌మెంట్
- ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ప్రకటన
- రూ.వెయ్యి కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే పర్మినెంట్ కానుంది. పార్కు చుట్టూ నిర్మించాలనుకున్న ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలను రద్దు చేశారు. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాల కోసం అమలు చేసిన వన్ వే విధానంతో ట్రాఫిక్ సమస్య తీరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును రీ అలైన్‌మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. పార్క్ చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లకు బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రీ- అలైన్‌మెంట్ తో రూ.1,090 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయం తగ్గనప్పటికీ .. భూసేకరణలో రూ.700 కోట్ల వరకు సేవ్ కానుంది. ఇప్పటికే నిర్మాణాల కోసం తవ్విన గుంతలను లెవల్ చేసి వన్ వేకి మరింత ఈజీగా ఉండేలా రోడ్డు నిర్మించనున్నారు.
కొత్త ప్రపోజల్ ఇది..
కొత్త ప్రపోజల్స్ ప్రకారం.. నాగార్జున సర్కిల్(ఎన్ఎఫ్ సీ) నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్లాన్ చేశారు. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ మీదుగా మాదాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాలు ఈ రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే బంజారాహిల్స్‌రోడ్ నంబర్ 10 నుంచి నాలెడ్జ్ సిటీ వెళ్లేందుకు ఇప్పటికే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ కోసం టెండర్లు కూడా పిలిచింది.
దీని ద్వారా బంజారాహిల్స్ రోడ్ నంబర్- 10 నుంచి రోడ్ నంబర్ 12, ఏసీబీ ఆఫీసు మీదుగా నాలెడ్జ్ సిటీ వైపు వెళ్లొచ్చు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్‌కు రూ.1,656 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే కేబీఆర్ చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. హెచ్-సిటీ పనులు చేపడుతున్న మెగా సంస్థకు బల్దియా ఇప్పటికే మార్పులపై సమాచారం ఇచ్చింది. దీంతో సంబంధిత పనులు 10 రోజులుగా నిలిచిపోయాయి.
రూ.వెయ్యి కోట్ల వరకు ఆదా..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నంబర్- 2, రోడ్ నంబర్- 45, ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్-82, రోడ్ నంబర్-12, రోడ్ నంబర్-10 ప్రాంతాల్లో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించాలని అనుకోగా, వీటికి రూ.1,090 కోట్లు, భూసేకరణకు మరో రూ.800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఇందులో 453 ఆస్తులు సేకరించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ పలువురు ఆస్తుల యజమానులు భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించారు.
టీడీఆర్ రూపంలో పరిహారం తీసుకునేందుకు కొందరు ముందుకు రాకపోవడంతో భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలోనే రీ-అలైన్‌మెంట్ ప్రపోజల్స్ రావడంతో ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ నిలిపేశారు. రీ-అలైన్‌మెంట్‌తో కేవలం 100 లోపు ఆస్తులు మాత్రమే సేకరించేలా ప్రతిపాదనలున్నాయి. రీ-అలైన్‌మెంట్‌తో భూసేకరణకు రూ.800 కోట్లకు బదులుగా రూ.100 కోట్లలోపు మాత్రమే అయ్యే అవకాశం ఉంది. అలాగే నిర్మాణ వ్యయంలో కూడా కొంత మేర తగ్గితే రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉంది.
