- ఫ్యూచర్ సిటీలో అమెజాన్, టీసీఎస్ డేటా సెంటర్లు
- 5.94 లక్షల మందికి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు
- రుణమాఫీతో 25.35 లక్షల రైతు కుటుంబాలకు ఊరట
- ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం మనదే
- మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నబియ్యంతో పేదలకు లబ్ధి
- 72 వేలకు పైగా సర్కారు కొలువుల భర్తీ
- ‘ప్రజా పాలన దినోత్సవం’లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నేల పోరాటాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని, నాటి అమరుల త్యాగాల స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా పాలన దినోత్సవం’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. సమ్మక్క–సారలమ్మల కాలం నుంచి సాయుధ రైతాంగ పోరాటం, మలిదశ ఉద్యమం వరకు అన్యాయాన్ని ఎదిరించడమే ఈ గడ్డ నైజమని కొనియాడారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, విద్యుత్ డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నామన్నారు. వీబీజీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైతుకు భూమే
జీవనాధారమని గుర్తించి, ‘భూ భారతి’ చట్టం తెచ్చి పాలనలో సమగ్ర మార్పులు చేశామన్నారు.
భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించి, 5.94 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేశామని తెలిపారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధన కోసం న్యాయపోరాటం చేస్తూనే, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. రైతుకు పూర్తి భరోసా కల్పించడం, మహిళా సాధికారత సాధించడం, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ బాట అని స్పష్టం చేశారు.
30 వేల ఎకరాల్లో నెట్‌జీరో సిటీ
దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ వేదికగా ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అమెజాన్ సంస్థ ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభించిందన్నారు. ఈ నగరంలో స్కిల్స్ వర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలను నెలకొల్పుతామని పేర్కొన్నారు.
రెండు దశల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
ఒకే విడతలో రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ ఊరట కల్పించామన్నారు. గత 32 నెలల కాలంలో వ్యవసాయ, రైతు సంక్షేమానికి ఏకంగా రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామని లెక్కలతో వివరించారు. ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు ఫ్రీ బస్‌జర్నీ కోసం రూ.12,385 కోట్లు అందించాం. ‘గృహజ్యోతి’ కింద 53 లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 43 లక్షల ఇళ్లకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.4,709 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. 4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంక్ లింకేజీ, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించామని వివరించారు. సీపెక్ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి పరిశీలనకు పంపామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’గా అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, కొత్తగా 15 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఆసరా పింఛన్ల కింద 43 లక్షల మంది లబ్ధిదారులకు రూ.31 వేల కోట్లు పంపిణీ చేయగా, మరో 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.
రూ.927తో స్కూల్పిల్లలకు టిఫిన్, పాలు
ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టడంతో పాటు నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బడి పిల్లలకు ఉదయం టిఫిన్, పాలు అందించడం కోసం రూ.927 కోట్లు వెచ్చిస్తున్నామని, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు పొడిగించామని వివరించారు. 11 లక్షల మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. తమ విద్యా సంస్కరణల ఫలితంగా జాతీయ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి ఏకంగా 18వ ర్యాంకుకు ఎగబాకిందని ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేందుకు అమెరికాకు చెందిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్ షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.
రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం
సీఎంఆర్ఎఫ్ తో 5.19 లక్షల మంది నిరుపేద రోగులకు రూ.2,526 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశామన్నారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్ల వ్యయంతో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చామని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్గఆస్పత్రులను అతిత్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్ది క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తలసరి ఆదాయం రూ.4,18,931
హైదరాబాద్‌లో రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేశామని సీఎం పేర్కొన్నారు. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాల అభివృద్ధికి అనుమతులు సాధించి, యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), గ్రీన్‌ఫీల్డ్ రహదారులు, డ్రైపోర్టులు, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్ర స్వరూపం మారనుందన్నారు. గ్రామాల నుంచి రాజధాని వరకు కనెక్టివిటీ కోసం ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.13 వేల కోట్లు, పంచాయతీరాజ్ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారులను ఆధునీకరిస్తున్నామని సీఎం వివరించారు. హైదరాబాద్ వాసులకు కాలుష్య రహిత స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని వెల్లడించారు. కల్తీ ఆహార విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ‘టీజీ సేఫ్’, రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ‘ఈగల్’ వ్యవస్థలను పటిష్ఠం చేశామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు 91 శాతం అధికమని గణాంకాలతో స్పష్టం చేశారు.
