- డిసెంబర్ 20న కానిస్టేబుల్ అభ్యర్థులకు..
- యూనిఫామ్ సర్వీస్ పోస్టుల రాత పరీక్షకు షెడ్యూల్ విడుదల
- 7,437 పోస్టులకు 4.29 లక్షల మంది నుంచి 5.77 లక్షల దరఖాస్తులు
- 298 ఎస్‌ఐ ర్యాంకు పోస్టులకు 1,60,756 అప్లికేషన్లు
- ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం సెప్టెంబర్ 30 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: పోలీస్ సహా యూనిఫామ్ సర్వీసెస్‌లో 7,437 పోస్టుల భర్తీకి రాత పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఎస్‌ఐ పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20 న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్ణయించింది. ఈ మేరకు బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. బుధవారంతో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసినట్లు తెలిపారు. జూలై 29న జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), అగ్నిమాపకశాఖ, జైళ్ల శాఖలో కలిపి 298 ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి పోస్టులు, 7,139 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు.. మొత్తంగా 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఒక్కో పోస్టుకు 58 మంది పోటీ పడుతున్నారు.
పోటీలో 1,46,220 మహిళా అభ్యర్థులు
ఆయా పోస్టులకు 4,29,000 మంది అభ్యర్థుల నుంచి 5,77,064 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి 1,46,220 (25.33 శాతం) అప్లికేషన్లు, పురుష అభ్యర్థుల నుంచి 4,30,844 (74.66 శాతం) అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో 298 ఎస్‌ఐ ర్యాంకు పోస్టులకు 1,60,756 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు అప్లై చేసుకోగా, 28.88 శాతం మంది రెండు పోస్టులకు, 2.423 శాతం మంది మూడు, 0.2 శాతం మంది నాలుగు, 0.046 శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌కు సెప్టెంబర్ 30 వరకు గడువు
పోలీస్ నియామకాల్లో తొలిసారిగా అమలు చేసిన ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌ను 97.4 శాతం మంది అభ్యర్థులు పూర్తి చేసినట్టు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2.6 శాతం మంది సెప్టెంబర్ 30లోగా లాగిన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు గడువు ఇచ్చామని తెలిపారు. సదరు అభ్యర్థులు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. నవంబరు 29న జరిగే ఎస్సై ప్రాథమిక పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో, డిసెంబరు 20న జరిగే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
