- ఫాంహౌస్ వెయ్యెకరాలని వెయ్యిసార్లన్నవ్
- అసెంబ్లీలో 67 ఎకరాలేనని ప్రకటించావ్
- కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు
- ఆయన ఇల్లే రెండెకరాలు.. వందల ఎకరాల జాగా ఉండె
- 67 ఎకరాల్లో సాగు చేసుకుంటే భూమి పెరిగినట్టా? తగ్గినట్టా..?
- సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా అనటం సరికాదు
- వీటిపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలె
- మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాల ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, రేవంత్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆస్తులన్నింటిపై విచారణకు ముందుకు రావాలని సీఎంకు సవాల్ విసిరారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఏర్పాటు చేసే సిట్‌లు, సెట్‌లు కాకుండా జ్యుడీషియల్ విచారణ చేయించాలన్నారు. తమ తప్పుందని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఉందని గతంలో వెయ్యిసార్లు రేవంత్ రెడ్డి అన్నారని.. కానీ, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌కు 67 ఎకరాలే ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే వాటిని ప్రభుత్వానికే రాసిస్తామని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లలోనే ఈ భూముల వివరాలను వెల్లడించారని.. అది ఆదాయపు పన్ను, స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూమి అని స్పష్టం చేశారు. ఇంతకాలం వాటిపై తప్పుడు ప్రచారం చేసి బురదజల్లినందుకు కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ది భూస్వాముల ఫ్యామిలీ
కేసీఆర్ భూస్వాముల కుటుంబంలో పుట్టారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాలుండేవన్నారు. చింతమడకలో ఇల్లు 2 ఎకరాలుండేదని, తర్వాత ఆ ఇంటినీ స్కూల్ కోసం ప్రభుత్వానికి ఇచ్చేశారని చెప్పారు. అంతకుముందు నిజాం కాలంలో అప్పర్ మానేరు ప్రాజెక్టు ముంపు కింద భూములు పోతే వచ్చిన రూ.లక్షల పరిహారంతోనే చింతమడకలో భూమి కొనుగోలు చేశారని తెలిపారు. పుట్టుకతోనే వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో జన్మించి, 72 ఏళ్ల వయస్సులో నేడు 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఆయన ఆస్తులు పెరిగినట్టా, తరిగినట్టా? అని ప్రశ్నించారు.
తాను జేఎన్‌యూ ఎంట్రన్స్ రాసి మాస్టర్స్ చేసి, జీమ్యాట్ రాసి అమెరికాలో ఎంబీఏ చదివి, అక్కడే ఆరున్నర ఏళ్లు ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించానన్నారు. రేవంత్ రెడ్డి1983లో ఎస్సెస్సీ, 1985లో ఇంటర్ పూర్తి చేశారని..డిగ్రీ పాస్ కావడానికి (1992లో ) ఏడేళ్లు పట్టిందన్నారు. వనపర్తిలో గోడల మీద రాతలు రాసే స్థాయి నుంచి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్‌లు నిర్మించుకునే స్థాయికి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ఆ ట్రిక్కు నిరుద్యోగ యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా అంతరిక్ష, ఏరోస్పేస్ కంపెనీలు ఎలా స్థాపించారని ప్రశ్నించారు. లగచర్లలో అల్లుడి కోసం గిరిజనుల భూములు లాక్కోవడం, సోదరుడికి అక్రమ భూకేటాయింపులు, బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వేల కోట్ల కాంట్రాక్టులు, వట్టినాగులపల్లి, నాదర్‌గుల్‌లో 379 ఎకరాల భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ధరణిని రద్దు చేసి భూభారతి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు.
అవి కబ్జా భూములనడం దుర్మార్గం
సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలకు, కార్మికులకు దశాబ్దాల క్రితం ఇచ్చిన 8 వేల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా భూములుగా చిత్రీకరించడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల సగం పట్టణం ఒకనాటి రాయిని చెరువు భూముల్లోనే విస్తరించి ఉందని, కమ్యూనిస్టుల కాలంలో సీహెచ్ రాజేశ్వరరావు తదితర నాయకులు చెరువు ఎండిపోతే అందులోనే పేదలకు, కార్మికులకు 60, 70 గజాల చొప్పున ప్లాట్లు చేసి పట్టాలు పంచి ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జీవో 58, 59 కింద ఆ పేదల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తే, దాన్ని నేడు ముఖ్యమంత్రి కబ్జా అనడం సిగ్గుచేటన్నారు. సిరిసిల్లకు పక్కనే ఉన్న పెద్దూరు, సర్దాపూర్, బాలాజీ కాలనీ, జగ్గారావుపల్లి వంటి ప్రాంతాల్లో రికార్డుల ప్రకారం 90 శాతం ప్రభుత్వ భూములే ఉన్నప్పటికీ, పట్టణం విస్తరించిన క్రమంలో దశాబ్దాల నుంచి ప్రజలు ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, పంటలు సాగు చేసుకుంటున్నారని చెప్పారు.
ఈ నెలాఖరున సిరిసిల్లకు వస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. సిరిసిల్లలో 8 వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ సర్వే నంబరో, ఏ ఊరో, ఎవరు కబ్జా చేశారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విఫల హామీలపై నిలదీస్తామన్న భయంతోనే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. తన కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం ప్రతిపక్షానికి లేదని రేవంత్ ప్రగల్భాలు పలికారని, ఆయనకు దమ్ముంటే తమ సస్పెన్షన్‌ను ఎత్తేసి నెల రోజులు సభ నడపాలని సవాల్ విసిరారు. అనుకోకుండా జాక్‌పాట్‌లో భాగ్యలక్ష్మి బంపర్ డ్రా మాదిరిగా సీఎం పదవి వచ్చిందని.. ఆయనకు శ్రీశ్రీ పూర్తి పేరు కూడా తెలియదన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్లెవరికీ జ్ఞానం లేదని విమర్శించారు.
