- 2004లో సున్నా.. 2023 అఫిడవిట్‌లో 53.30 ఎకరాలు
- 2010లో కేటీఆర్‌కు ఎకరమే 2023లో 75 ఎకరాలు
- పదేండ్లలో ఇంత జాగా ఎలా వచ్చిందంటున్న సోషల్ మీడియా
- సీఎం ప్రకటన తర్వాత భూముల లెక్కలతో పోస్టులు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల అఫిడవిట్లు ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య ‘భూ’ వార్‌కు వేదికగా మారాయి. కేసీఆర్, కేటీఆర్ వివిధ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న భూముల వివరాలు, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ ఎన్నికలప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఈసీకి సమర్పించిన అఫిడవిట్లను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 2004లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం భూమి కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొనగా.. 2023 నాటికి ఆయన కుటుంబం పేరిట 53.30 ఎకరాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. ఇక 2010లో కేటీఆర్ పేరిట కేవలం ఒక్క ఎకరం మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనగా.. 2023 నాటికి ఆయన కుటుంబం పేరిట 75 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. పదేండ్లలో ఇంత భూమి ఎలా పెరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు సైతం అడ్డగోలుగా భూములు కూడబెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ కూడబెట్టిన భూములు, ఆస్తులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ ఎన్నికల్లో వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 2004 నాటి కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా సమర్పించిన ఫారం-26 నామినేషన్ అఫిడవిట్‌ను ఆయన ప్రజల ముందుకు తెచ్చారు. ఆ దస్తావేజుల ప్రకారం.. కేసీఆర్‌కు గానీ, ఆయన సతీమణికి గానీ ఒక్క గుంట వ్యవసాయ భూమి గానీ, కనీసం వ్యవసాయేతర భూమి గానీ లేదని, అప్పట్లో బంజారాహిల్స్ రోడ్ నం.14లోని రూ.70 లక్షల విలువైన ఇల్లు మినహా స్థిరాస్తుల కాలమ్‌లో ‘నిల్’ అని స్పష్టంగా రాశారని గుర్తుచేశారు.నాడు కనీసం సెంటు భూమి కూడా లేని కేసీఆర్.. నేడు వేల కోట్ల విలువైన భూసామ్రాజ్యానికి ఎలా అధిపతి అయ్యారని నిలదీశారు. ఆ తరువాత 2014లో 38 ఎకరాలు చూపించారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత పదేళ్ల అధికారంలో ఉండగా ధరణిని ఆయుధంగా మలచుకుని ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను మింగేశారని ఆరోపించారు. ఉద్యమకారులకు అప్పులు మిగిలితే, కేసీఆర్ మాత్రం వేల కోట్లు గడించిన ‘భూ బకాసురుడు’గా మారారని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
కేసీఆర్‌తోపాటు కేటీఆర్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లను కూడా మంత్రి పొంగులేటి బయటపెట్టారు. పరిస్థితి ఇలా ఉంటే తమకు చిన్నప్పటి నుంచే వందల ఎకరాల ఆస్తులున్నాయంటూ కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 2009 సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్ సర్వే నెం.437లో కేవలం ఒక్క ఎకరం వ్యవసాయ భూమి (విలువ రూ.50,000) మాత్రమే ఉందన్నారు. ఆయన భార్య పేరిట అల్వాల్‌లో 660, 534 చదరపు గజాల ప్లాట్లు, మొయినాబాద్‌లో 400 చదరపు గజాల స్థలం, కొండాపూర్‌లోని ఓ ఫ్లాట్ మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు. ఆనాడు కేవలం ఒకే ఒక్క ఎకరం ఉన్న కేటీఆర్.. దశాబ్ద కాలంలో వేల కోట్ల విలువైన ఆస్తులను ఎలా పోగేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్లలో రాసింది అబద్ధమా లేక ఇప్పుడు చెప్తున్న కబుర్లు బోగస్సా అని ప్రశ్నిస్తూ ‘డ్రామారావు’ బండారం బట్టబయలైందని ఎద్దేవా చేశారు.
సీఎం కుటుంబంపై హరీశ్ఆరోపణలు
బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కూడా పెద్ద ఎత్తున భూములు సంపాదించిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబానికి వెల్దండ మండలం కొత్ర గ్రామంలో 175 ఎకరాలు, వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 79 ఎకరాలు, అఫిడవిట్ల ప్రకారం మరో 54 ఎకరాలు ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న గోపన్‌పల్లి, నాచారం, మంచిరేవుల, వట్టినాగులపల్లిలలోని అత్యంత ఖరీదైన భూములతో పాటు చౌటుప్పల్ మల్కాపురంలో ఏ గీతారెడ్డి పేరిట ఉన్న 32 ఎకరాల భూమిపై కూడా క్షేత్రస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమపై బురదజల్లే ముందు పాలకులు తమ సొంత ఆస్తుల పెరుగుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ సవాల్ విసిరింది. సీఎం ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తాజాగా కేటీఆర్ డిమాండ్ చేశారు. పోటా పోటీగా ఇరుపక్షాలు భూముల దస్తావేజులు, సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను సోషల్ మీడియాలో బయటపెడుతుండటంతో రాష్ట్ర రాజకీయం అఫిడవిట్ల చుట్టూ భూముల చుట్టూ తిరుగుతున్నది.
రెట్టింపైన కేసీఆర్ కుటుంబ భూములు!
ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్ కుటుంబ సభ్యులు స్వయంగా సమర్పించిన గణాంకాలు, తాజాగా అసెంబ్లీలో సీఎం వెల్లడించిన అధికారిక లెక్కల ను బేరీజు వేస్తే వారి భూములు కాలక్ర మేణా ఏ స్థాయిలో రెట్టింపయ్యాయో స్పష్టమవుతోంది. 2010 నాటికి కేసీఆర్ కుటుంబం పేరి ట కనీసం ఒక్క గుంట భూమి కూడా లేకపోగా (సున్నా ఎకరాలు), 2014 సార్వత్రిక ఎన్నికల సమయాని కి అది 38 ఎకరాలకు, 2023 ఎన్నికల నాటికి 53.30 ఎకరాలకు, తాజాగా ప్రభుత్వం అసెంబ్లీ లో బయటపెట్టిన రికార్డుల ప్రకారం ఏకంగా 67.13 ఎకరాలకు ఎగబాకింది. ఇక కేటీఆర్ కుటుంబం విషయానికొస్తే 2010లో కేవలం ఒకే ఒక్క ఎకరం ఉన్న భూమి.. 2014 నాటికి 31 ఎక రాలకు, 2023 నాటికి 75 ఎకరా లకు, మొన్న లెక్కలతో ఏకంగా 123.19 ఎకరా లకు విస్తరిం చించింది. మాజీ మంత్రి హరీశ్ కుటుంబానికి 2010, 2014లలో 17.3 ఎక రాల చొప్పున ఉండ గా, 2023 ఎన్నికల నాటికి 21.5 ఎకరాలకు, ప్రస్తుతం 30.16 ఎకరాలకు చేరింది. మరోవైపు కవిత కుటుంబానికి 2010లో వ్యవసాయ భూమి నమోదు కాకపో గా, 2014, 2023లలో 27 ఎకరాల చొప్పున ఉన్నట్లు చూపించి, ఇప్పుడు అది 37.26 ఎకరాలకు ఎగబాకింది.
