- ట్రంప్ సంతకం తర్వాత కార్యరూపం
- భారత్‌తో పాటు చైనా పైనా ప్రభావం
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించేందుకు ప్రతిపాదించిన ‘రష్యా ఆంక్షల బిల్లు’కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 262, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు సెనెట్‌లో ఆగస్టు 7వ తేదీనే 86-–11 ఓట్ల తేడాతో పాస్ అయింది. ఇప్పుడు ప్రతినిధుల సభ కూడా పాస్ చేయడంతో.. ఇక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయగానే చట్టరూపం దాల్చనుంది. ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చి, ట్రంప్ వంద శాతం టారిఫ్‌లు ప్రకటిస్తే గనక.. భారత్, చైనాపై తీవ్ర ప్రభావం పడనుంది.
రష్యా అధికారులను, బ్యాంకులను, ఆ దేశ ఇంధన వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించడం ద్వారా ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా చేయాలన్నదే ఈ బిల్లు ఉద్దేశంగా చెప్తున్నారు. లిండ్సే పేరిటే దీనికి ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ బిల్లుగా దీనికి పేరు పెట్టారు. ఈ బిల్లులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే టాప్ 5 దేశాలపై వంద శాతం సుంకాలు విధించే అధికారం అమెరికా ప్రెసిడెంట్‌కు ఉంటుంది. 15 శాతం కన్నా తక్కువ ఆయిల్, గ్యాస్ కొనే దేశాలకు, ఆ కొనుగోళ్లను తగ్గించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్న దేశాలకు మాత్రం ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి చైనా తర్వాత భారత్ అత్యధికంగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 100% టారిఫ్‌లు విధించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే, రష్యాతోపాటు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకునే చర్యలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. ఇరాన్‌పై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను మరో ఐదేండ్లు పొడిగించాలని కూడా ప్రతిపాదించారు.
డెమోక్రాట్‌లలో భిన్నాభిప్రాయాలు
ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులంతా ఉక్రెయిన్‌కు నిరంతరం మద్దతు ఇస్తూ వస్తున్నారు. యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే చర్యలకు వారు అంగీకారం తెలుపుతున్నారు. కానీ, ఈ బిల్లు విషయంలో మాత్రం డెమోక్రటిక్ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ బిల్లును సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. మేరీల్యాండ్ ప్రతినిధి స్టెనీ హోయర్, ఇతర డెమోక్రాట్‌లు బిల్లును సమర్థించగా.. ఈ బిల్లు ద్వారా అత్యధికంగా టారిఫ్‌లు విధించే అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెట్టడాన్ని కొందరు డెమోక్రాట్లు తప్పుపట్టారు. దీని ప్రకారం ట్రంప్ చర్యలు తీసుకుంటే.. యూరప్ దేశాలతోపాటు అమెరికా ఇతర మిత్రదేశాలపై అత్యధిక సుంకాలు విధించాల్సి వస్తుందని, తద్వారా అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని విమర్శించారు. దేశంలో ఆయా వస్తువుల ధరలు పెరిగి అమెరికన్ వినియోగదారులు కూడా ప్రభావితం అవుతారని న్యూయార్క్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్, వర్జీనియా ప్రతినిధి డాన్ బేయర్, తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, చైనా మారాలి..
రష్యా చమురు, సహజ వాయువుపై ఆధారపడటం తగ్గించుకోవాలని, లేకపోతే అమెరికా నుంచి భారీ పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ బృందంలోని కీలక సభ్యుడు రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్‌లో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్, చైనా తమ పద్ధతి మార్చుకోవాలని, రష్యా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆటలు సాగవని.. ఉక్రెయిన్ ఒంటరి కాదన్నారు. ఈ బిల్లు ద్వారా విధించే ఆంక్షలకు పుతిన్ దిగిరాక తప్పదని ఆయన పేర్కొన్నారు.
