- అందరికీ సమాన అవకాశాలొస్తేనే జాతీయ సమైక్యత బలపడుతుంది
- పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి
- సెప్టెంబర్ 17నే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం: గవర్నర్
- నిజాం గొప్పోడని సీఎం అనటం సిగ్గుచేటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం
- అప్పుడు అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి
- జోధ్‌పూర్, హైదరాబాద్‌ది చారిత్రక బంధం: కేంద్ర మంత్రి షెకావత్
- నిజాంను పొగిడే వాళ్ల డీఎన్ఏ చెక్ చేయాలె : కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సరిగ్గా 78 ఏండ్ల కింద 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’తో దేశ చరిత్రలోనే అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ విమోచనం కోసం రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల గాథలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని చెప్పారు.
గురువారం పరేడ్ గ్రౌండ్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరులకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సంస్థానాల విలీనంపై అనిశ్చితి నెలకొందని, పటేల్ వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారని కొనియాడారు. నిజాం లొంగిపోవడానికి నిరాకరించిన వేళ.. పటేల్ తెగువతో చేపట్టిన చర్యలే హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో భాగం చేశాయన్నారు. స్వాతంత్ర్యం తీసుకురావడంలో మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతటి కీలకపాత్ర పోషించారో.. స్వతంత్ర భారతం ముక్కలు కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ అంతే కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు.
సమానత్వంతోనే దేశ సమైక్యత బలోపేతం..
కేవలం భూభాగాలను సరిహద్దుల్లో కలుపుకున్నంత మాత్రాన దేశ సమైక్యత నిలవదని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు, ఆత్మగౌరవం కల్పించినప్పుడే సమైక్యత బలపడుతుందన్నారు. దేశంలో భిన్న భాషలు, ఆరాధనా పద్ధతులు, ఆలోచనలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగం దృష్టిలో అందరం ఒక్కటేనని పేర్కొన్నారు. దేశభద్రతలో కేంద్ర బలగాల పాత్ర అమూల్యమైనదని రాధాకృష్ణన్ ప్రశంసించారు. శాంతిభద్రతల సమస్యలు లేని ‘నక్సల్స్ రహిత భారత్’ను నిర్మించాలన్నదే ప్రధాని మోదీ విజన్ అని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వం, పకడ్బందీ పర్యవేక్షణలో దేశంలో వామపక్ష తీవ్రవాదం దాదాపు అంతమైందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం కనుమరుగు కావడంతో అక్కడ అభివృద్ధి వేగవంతమైందని చెప్పారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం రాంజీ గోండు, కుమ్రం భీం, తుర్రేబాజ్ ఖాన్ వంటి మహనీయులతో పాటు వేలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి అద్భుత పోరాటాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు.
జోధ్ పూర్, హైదరాబాద్ మధ్య విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్ షెకావత్
హైదరాబాద్‌కు, జోధ్‌పూర్‌కు మధ్య విడదీయరాని చారిత్రక బంధం ఉందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. నాటి పోరాటంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు జోధ్‌పూర్ సైన్యం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. ఆ బంధంతోనే జోధ్‌పూర్ ప్రతినిధిగా తాను ఈ వేడుకలకు వచ్చానని తెలిపారు. ఇక్కడి ప్రజలు భారతదేశంలో కలిసేందుకు నిజాం నిరంకుశ పాలనపై ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తుచేశారు. భావితరాలకు పోరాట పటిమను నేర్పిన ఈ గడ్డ త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
చరిత్రను కనుమరుగు చేసే కుట్రలను తిప్పికొట్టేందుకే: బండి సంజయ్
తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తాన్ని కళ్లజూసిన నిజాంను అసెంబ్లీ సాక్షిగా కొందరు పొగడటం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ ఊచకోతలను మరిచి నిజాంను పొగిడే నాయకులకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని, వాళ్లకు విదేశీ డీఎన్ఏ ఉందేమో తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలను తిప్పికొట్టేందుకే కేంద్రం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.
2029లో అధికారికంగా నిర్వహిస్తం: కిషన్ రెడ్డి
నిజాం చాలా గొప్పవాడంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం మంచోడే అయితే ప్రజలు గ్రామాల్లో బురుజులు కట్టి ఉద్యమం ఎందుకు చేశారు? వేలాది మంది ఎందుకు బలయ్యారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. నిజాం పోయినా.. ఆయన రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికీ వందేమాతరం గేయాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. ఎంఐఎం పార్టీ బాధపడుతుందనే ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు.
సెప్టెంబర్ 17నే నిజమైన స్వేచ్ఛ: గవర్నర్
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు 1948 సెప్టెంబర్ 17నే నిజమైన స్వేచ్ఛ లభించిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రైతులు, మహిళలు, యువత, ఆదివాసీలు ఎన్నో ఆకృత్యాలను ఎదుర్కొని ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈ స్వాతంత్ర్యం సులభంగా రాలేదని.. నాటి త్యాగాలను నేటి యువత లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు. విభేదాలను పక్కనపెట్టి సమర్థవంతమైన, సుసంపన్నమైన తెలంగాణతో పాటు మహనీయుల కలల భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
