- సీఎం బయటపెట్టింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ లెక్కలే
- ఇంకా వారి బినామీల పేరిట వందల ఎకరాలు, ఆక్రమాస్తులున్నయ్
- ఫాంహౌస్ సర్వేపై వెనక్కి వెళ్లొద్దని సీఎంను కోరుతున్నా
- 22ఏపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది అవగాహనరాహిత్యం
- ఢిల్లీలో మీడియాతో పీసీసీ చీఫ్ చిట్ చాట్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 64 శాతానికి పైగా గజం భూమి కూడా లేని పేదోళ్లు ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మరి ఎన్నికల అఫిడవిట్‌లో సున్నా భూములు చూపినా కేసీఆర్ ఫ్యామిలీకి.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి 2024 వరకు ధరణి పేరిట రక రకాలుగా ప్రభుత్వ భూమి దోపిడీ జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది కేవలం కేసీఆర్ కుటుంబం లెక్కలేనని, ఇంకా వారికి బినామీలుగా ఉన్న అనుచరుల పేరిట వందల ఎకరాల భూములు, ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భూ దోపిడీని గుర్తించే.. 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘పీసీసీ చీఫ్‌గా సీఎంను కోరుతున్నా. కేసీఆర్ ఫాంహౌస్, ఆయన కుటుంబ భూములపై సర్వే చేపట్టాలని చాలా చోట్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ సర్వే విషయంలో వెనక్కి వెళ్లొద్దు. ప్రొసీడ్ కావాల్సిందే. కేసీఆర్ ఫాంహౌస్ మొత్తాన్ని సర్వే చేయాల్సిందే. ఎవరి ప్రైవేట్ ఆస్తిని గజం కూడా గుంజుకోం. నిజాయతీగా భూములు సంపాదిస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఏం అవసరం?’’ అని ఆయన అన్నారు.
వందల ఎకరాలు ఎలా వచ్చాయి?
2004, 2009 ఎలక్షన్ అఫిడవిట్‌లలో గజం వ్యవసాయ భూమి లేదని కేసీఆర్ చూపారు. మరి ఇప్పుడు ఆయనకు, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ల పేరిట భూములు ఎక్కడి నుంచి వచ్చాయని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘వాళ్లు ఇచ్చిన అఫిడవిట్‌ల ప్రకారం.. 2004, 2009లో కేసీఆర్ పేరుపై వ్యవసాయ భూములు లేవు. ఆయన భార్య పేరుపై కూడా గజం భూమి లేదు. కానీ 2024కు వచ్చేసరికి కేసీఆర్, ఆయన భార్య పేరుపై భూములు వచ్చాయి. 2014 నాటికి కేసీఆర్ భూమి 36 ఎకరాలకు పెరిగింది. 2026 వచ్చే సరికే 67. 13 ఎకరాలకు చేరింది. అలాగే 2010లో కేవలం ఒకే ఎకరం ఉన్నట్లు కేటీఆర్ అఫిడవిట్‌లో చూపారు. ఆయన భార్య పేరుపై భూమి లేదు. 2014 వరకు 30 ఎకరాలకు చేరింది. 2023 నాటికి కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుమార్తె, కుమారుడి భూములు 123 ఎకరాలకు చేరాయి. ఇంత హైపు ఎలా వచ్చింది. అవకతవకలు, దోపిడీ జరిగినట్లు స్పష్టంగా కన్పిస్తోంది” అని అన్నారు. కేసీఆర్ కుటంబ అవినీతి, దోపిడీని ఒక్కటొక్కటిగా ప్రజల ముందు ఉంచుతామన్నారు.
అందరి ఆస్తుల లెక్కలూ తేల్చాలి..
పార్టీలతో సంబంధం లేకుండా అక్రమంగా ఎవరు భూములు సంపాదించినా లెక్కతేల్చాలని సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ గౌడ్ కోరారు. ‘‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా.. ఏ పార్టీ నేతలు అయినా అక్రమ ఆస్తులు కూడబెడితే లెక్కించండి. అవసరమైతే పార్టీ నేతలు తమ భూముల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడిస్తే బాగుంటుంది. నేను నా ఆస్తులు, భూముల వివరాలు వెల్లడిస్తాను. ప్రతిపక్ష నేతలు సైతం కాంగ్రెస్ నేతల అక్రమ భూములు, ఆస్తుల వివరాలు బయటపెడితే విచారణ చేయిస్తాం. తప్పు తేలితే.. కేసీఆర్ కుటుంబంపై ఉండే చర్యలే, వాళ్లపై ఉంటాయి”అని ఆయన స్పష్టం చేశారు. వర్సిటీ భూములను నిషేధ జాబితాలో పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వర్సిటీ భూములను ఎవరూ అమ్మలేరని, అవి నిషేధ జాబితాలోనే ఉంటాయన్నారు.
అక్టోబర్ చివరి నాటికి పదవుల భర్తీ
ఖాళీగా ఉన్న డీసీసీలతో పాటు రెండు మూడు డీసీసీల మార్పు.. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల భర్తీ అక్టోబరు చివరి వరకు పూర్తవుతాయని మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలోనిదని స్పష్టం చేశారు. తనను క్యాబినెట్‌లోకి తీసుకుంటారని మీడియాలో చూస్తున్నానే తప్పా.. మంత్రి పదవిని అడగలేదన్నారు. ఒకవేళ ఆ అవకాశం వస్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. కానీ, మంత్రి పదవి కంటే పీసీసీ పదవి పెద్దదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశానని తెలిపారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినందున కనీసం బీసీలకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని కోరానన్నారు. కొండా సురేఖ ముక్కు సూటి మనిషి అని, ఆమె ప్రొఫైల్ చిన్నదికాదన్నారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం వల్లే ఆమె పట్ల హైకమాండ్ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్ల భూముల్ని కొల్లగొట్టింది
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం భూ దోపిడీ చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. 22ఏ పాపం బీఆర్ఎస్దేనని విమర్శించారు. ఉద్యమాలు చేసిన వారు సర్వం కోల్పోతే కేసిఆర్ ఫ్యామిలీ మాత్రం లక్షల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. ఈ భూ దోపిడీపై విచారణ జరుగుతున్నదని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలా? లేదా? అనేది సీఎం నిర్ణయిస్తారని తెలిపారు. పీసీసీ చీఫ్ గా రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేశ్ గౌడ్ గురువారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు.
అనంతరం పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధిష్టానానికి వివరించినట్లు చెప్పారు. ‘రెండేండ్లలో పార్టీ సంస్థాగతంగా సాధించిన విజయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా. నా పదవీకాలం ఇంకో ఏడాది ఉంది. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తం. త్వరలో పూర్తి కార్యవర్గాన్ని, ఖాళీగా ఉన్న చోట్ల డీసీసీ అధ్యక్షులను నియమిస్తం. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? వద్దా? అనేది సీఎం నిర్ణయిస్తారు’ అని చెప్పారు. మాజీ మంత్రి కొండా సురేఖ ఇష్యూ ముగిసిందని, ఆమె పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ లండన్ వెళ్తున్నారని, ఆమె స్థానంలో కొత్త వారిని నియమించే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
