తమిళనాడులో.. హిందీ వద్దంటే కుదరదు: సుప్రీంకోర్టు

తమిళనాడులో.. హిందీ వద్దంటే కుదరదు: సుప్రీంకోర్టు
  • నవోదయ స్కూళ్ల ఏర్పాటుపై పునరాలోచించండి
  • టీవీకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించడానికి కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌‌‌‌వీ) ఏర్పాటుపై వ్యతిరేకతను పునఃసమీక్షించుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ప్రతి జిల్లాలో నవోదయ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌‌‌‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన కోర్టు, స్కూళ్ల కోసం స్థలాలను గుర్తించేందుకు తమిళనాడుకు మరో మూడు నెలల గడువు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం హిందీ పట్ల తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న సూచించారు. ‘‘తమిళనాడు గడ్డపై హిందీనే బోధించకూడదనే ధోరణి సరైంది కాదు. చెన్నై ప్రజలు ఢిల్లీని కానీ, ఢిల్లీ ప్రజలు చెన్నైని కానీ పరాయిదానిలా చూడకూడదు” అని పేర్కొన్నారు. 

కేంద్రం, రాష్ట్రం పరస్పరం చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. నవోదయ స్కూళ్లు విద్యార్థులకు అదనపు విద్యా అవకాశాలను కల్పిస్తాయని, దీనివల్ల తమిళనాడు విద్యా ప్రమాణాలేవీ తగ్గవని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలో నవోదయ స్కూళ్లకు అవసరమైన భూములను గుర్తించాలని 2025 డిసెంబర్‌‌‌‌లో సుప్రీంకోర్టు తమిళనాడును ఆదేశించింది. ఈ ఆదేశాలను రద్దు చేయాలని రాష్ట్రం కోరగా, కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.