పేదోడికి గుంట లేదు..పెద్దోడికి వందల ఎకరాలు..ల్యాండ్ సీలింగ్ యాక్ట్కు సంపన్నుల తూట్లు

పేదోడికి గుంట లేదు..పెద్దోడికి వందల ఎకరాలు..ల్యాండ్ సీలింగ్ యాక్ట్కు సంపన్నుల తూట్లు
  • 20 ఎకరాలపైన ఉన్న అగ్రవర్ణాలు 4.4%, బీసీలు 1.6%, ఎస్సీలు ఒక్క శాతమే!
  • డిజిటల్ వ్యవస్థ వచ్చినా మారని పరిస్థితి!

హైదరాబాద్, వెలుగు:  భూమి కోసం, భుక్తి కోసం నాడు సాయుధ రైతాంగ పోరాటం పేరుతో పెత్తందార్లపై తిరగబడినా, తర్వాత తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల పేరుతో సీమాంధ్రులతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా.. అన్ని పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచిన భూమి మాత్రం కొన్ని వర్గాల దగ్గరే పోగుపడ్తున్నది. రాష్ట్రంలో ఓవైపు కొందరు బడాబాబులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెండ్లాం, పిల్లల పేరిట వందల ఎకరాలు వెనకేసుకుంటుండగా, గుంట భూమికీ దిక్కులేని పేదల సంఖ్య పెరిగిపోతున్నది. కేవలం 35.6 శాతం మంది చేతుల్లోనే మొత్తం భూమి కేంద్రీకృతమై ఉండగా, ఏకంగా 64.4 శాతం మందికి గుంట భూమి కూడా లేదని ఇటీవలి సీపెక్ సర్వేలో తేలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడ్తున్నది.

ఉమ్మడి ఏపీలో  తెచ్చిన ‘ల్యాండ్ సీలింగ్ చట్టం-1973’ క్షేత్రస్థాయిలో పూర్తిగా నీరుగారిపోయింది. ఐదు దశాబ్దాలు గడిచినా ఈ చట్టంలోని నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది, ముఖ్యంగా రాజకీయ నేతలు అపరిమితంగా భూములను పోగేసుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సీలింగ్​యాక్ట్‌‌కు మించి ఉన్న భూముల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టారు. చట్ట ప్రకారం భార్య, భర్త, మైనర్ పిల్లలను కలిపి ఒక కుటుంబ యూనిట్‌‌గా పరిగణిస్తారు. కుటుంబ యూనిట్‌‌కు మెట్ట భూమి 54 ఎకరాలు, మాగాణి అయితే 27 ఎకరాలకు మించరాదు. కానీ, ఈ చట్టం అమలును రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది సంపన్నులు ఈ పరిమితిని దాటి లక్షల ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయంలో నష్టాలు, అప్పుల కారణంగా లక్షలాది మంది బడుగు రైతులు తమకున్న కొద్దిపాటి భూములను అమ్ముకుంటూ కూలీలుగా మిగులుతున్నారు. ఇక మొదటి నుంచీ భూమి లేని పేదలు తలదాచుకునేందుకు గుంట భూమి కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు.  

సీపెక్ సర్వేలో చేదు నిజాలు..  

రాష్ట్రంలో నిర్వహించిన సీపెక్ సర్వే గణాంకాలు తెలంగాణలో నెలకొన్న ఆర్థిక, భూ అసమానతలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది నుంచి సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం, మొత్తం జనాభాలో ఏకంగా 64.4 శాతం మందికి ఒక్క గుంట భూమి కూడా లేదని స్పష్టమైంది. కేవలం 35.6 శాతం మంది చేతుల్లోనే మొత్తం భూమి కేంద్రీకృతమై ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల్లో భూములు, ఫామ్‌‌హౌస్‌‌లు, బినామీల పేరుతో ఆస్తులున్నట్టు తేలడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సీపెక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి (భారీ కమతాలు) ఉన్న అగ్రవర్ణాల వాటా ఏకంగా 4.4 శాతం కాగా..  సమాజంలో అత్యధికులైన  బీసీల్లో 20 ఎకరాలకు పైబడిన వారు కేవలం1.6 శాతమే ఉన్నారు. ఇక దళితుల్లో (ఎస్సీ) ఈ వాటా  కేవలం 1.0 శాతం కాగా,  ఎస్టీల్లో అత్యల్పంగా 0.4 శాతంగా ఉంది.

ఇక10 నుంచి 20 ఎకరాలుండే మధ్యతరహా కమతాల్లోనూ అగ్రవర్ణాలు11.8 శాతం వాటా కలిగి ఉండగా.. బీసీలు 4.2 శాతం, ఎస్సీలు 1.8 శాతం, ఎస్టీలు కేవలం1.1 శాతానికే పరిమితమయ్యారు. దీన్నిబట్టి రాష్ట్రంలో10 ఎకరాల కన్నా ఎక్కువ భూములున్న అగ్రవర్ణాల వారు16 శాతానికి పైగా ఉన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూమి లేకపోవడం సామాజిక సంక్షోభంగా మారుతోందని ఎక్స్‌‌పర్ట్స్ చెప్తున్నారు. దళితుల్లో ఏకంగా 68 శాతం కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. మిగిలిన దళితుల్లోనూ దాదాపు 85.5 శాతం మందికి అర ఎకరం నుంచి రెండున్నర ఎకరాల లోపు మాత్రమే ఉంది. గిరిజనుల్లో  85.0 శాతం మంది వద్ద 5 ఎకరాల కంటే తక్కువ భూమి మాత్రమే ఉంది. కానీ అటవీప్రాంతాల సమీపంలోని ఆయా భూముల్లో పెద్దగా పంటలు పండడం లేదు. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీల్లో 49.2 శాతం మందికి భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, అందులో 75.8 శాతం మంది 5 ఎకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. 

డిజిటలైజ్ అవుతున్నా ఫలితం సున్నా.. 

ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులో రెవెన్యూ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడంవల్లే  సంపన్నులు చట్టాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాన్యువల్ రికార్డులు, పహాణీలు అమలులో ఉన్నప్పుడు, ఒకే వ్యక్తి లేదా కుటుంబం వేర్వేరు గ్రామాలు, మండలాల్లో భూములు కొనుగోలు చేస్తే వాటిని గుర్తించడం రెవెన్యూ అధికారులకు క్లిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ,  ధరణి పోర్టల్ ఆ తర్వాత భూభారతి అందుబాటులోకి వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. భూ సంస్కరణల చట్టం ప్రాథమిక సూత్రమైన కుటుంబం యూనిట్‌‌ను పరిగణనలోకి తీసుకోకుండా, వ్యక్తిగత పట్టాదారు పాస్‌‌పుస్తకాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, నిర్వహణ సాగిస్తున్నారు. భార్య, భర్త, మైనర్ పిల్లల పేర్లతో వేర్వేరుగా పదుల ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

సీలింగ్‌‌కు మించితే స్వాధీనం చేస్కోవాలి.. 

డిజిటల్ టెక్నాలజీ యుగంలో భూ రికార్డులను పారదర్శకంగా మార్చడం, పరిమితికి మించి భూములున్న బడాబాబులను పట్టడం సులువేనని ఎక్స్‌‌పర్ట్స్​చెప్తున్నారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూపొందించిన రేషన్ కార్డు డేటాను లేదా కుటుంబ గుర్తింపు కార్డులను యూనిట్‌‌గా తీసుకుంటే కుటుంబ సభ్యుల వివరాలన్నీ స్పష్టంగా తెలిసే అవకాశముంది. ఆధార్ అనుసంధానంతో కూడిన రేషన్ కార్డులను భూభారతి పోర్టల్ డేటాతో సమగ్రంగా మ్యాపింగ్ చేస్తే, ఏ కుటుంబం పేరిట ఏయే గ్రామాల్లో ఎంత విస్తీర్ణంలో భూములున్నాయో నిమిషాల్లో వెలుగులోకి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్లను వినియోగించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్థిరాస్తుల వివరాలను అనుసంధానించవచ్చు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, పరిమితికి మించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ఉన్నత స్థాయి సర్వే కమిషన్ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
చట్టం ఏం చెబుతుందంటే..  

1973 నాటి ల్యాండ్ సీలింగ్ చట్టం భూమి స్వభావం, నేల సారాన్ని బట్టి స్పష్టమైన వర్గీకరణలను పేర్కొంది. ఐదుగురు సభ్యులున్న(భార్య, భర్త, ముగ్గురు మైనర్ పిల్లలు) కుటుంబ యూనిట్‌‌కు ఈ పరిమితులు కచ్చితంగా వర్తిస్తాయి. ప్రభుత్వం నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండి, ఏడాదికి రెండు పంటలు పండే మాగాణి అయితే ఒక కుటుంబానికి గరిష్టంగా10 నుంచి12 ఎకరాల వరకే పరిమితి ఉంటుంది. ఒకే పంట పండే సాధారణ మాగాణి లేదా చెరువులు, ఇతర జలవనరుల కింద సాగయ్యే భూములైతే ఆయా రకాలను బట్టి 12 నుంచి గరిష్టంగా 27 ఎకరాల వరకు మాత్రమే ఉంచుకోవాలి. కేవలం వర్షాధార మెట్ట భూములను (డ్రై ల్యాండ్స్) నేల రకం, మట్టి సారం, దిగుబడి సామర్థ్యం ఆధారంగా 35 నుంచి 54 ఎకరాల వరకు సీలింగ్ విధించారు. ఒకవేళ కుటుంబంలో ఐదుగురి కంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్కరికి కొంత అదనపు విస్తీర్ణం అనుమతించినప్పటికీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక పరిమితికి రెట్టింపు(డబుల్ సీలింగ్) మించరాదు. కానీ, ఈ శాస్త్రీయ వర్గీకరణను పూర్తిగా తుంగలో తొక్కి, అధికారుల అండతో బడా బాబులు వేలాది ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం చట్ట ఉల్లంఘనేనని రెవెన్యూ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.