హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ భారీగా ఉంది. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో బడా గణేష్ దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. బడా గణేష్ దర్శనానికి వెళ్లే అన్ని మార్గాల క్యూ లైన్లు ఫుల్ అయి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లతో పాటు ఎమర్జెన్సీ ఎంట్రీల ద్వారా భక్తులకు పోలీసులు దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీని పోలీసులు సీసీ కెమెరా నిఘా ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పబ్లిక్కు ఇబ్బంది కలగకుండా బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం సెప్టెంబర్ 23 వరకు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. బడా గణేష్ దర్శానికి సొంత వాహనాల్లో వచ్చే కంటే.. మెట్రో, MMTS, RTC స్పెషల్ బస్సు లలో భక్తులు రావాలని విజ్ఞప్తి చేశారు.
బడా గణేష్ దర్శనానికి వీకెండ్స్ లో ఈవినింగ్ టైమ్ లలోనే ఎక్కువగా వస్తుంటారని.. అలా కాకుండా వీక్ డేస్ లలో కూడా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకేసారి.. కార్ పులింగ్ ద్వారా రావాలని సూచించారు.
ఐమాక్స్ గ్రౌండ్, HMDA ప్లేస్లో, NTR పార్క్ బ్యాక్ సైడ్, నెక్ లెస్ రోడ్ ప్రాంతాలలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెట్రోలో వచ్చే భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. VIPలకు ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పది రోజులు భక్తులు సహకరించాలని కోరారు.
