Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందే భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తత స్టార్ట్ అయింది. ఆసియా కప్‌లో పీసీబీ ఛైర్మన్, ఏసీసీ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. కానీ జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిస్తే, అతడి చేతుల మీదుగానే గోల్డ్ మెడల్స్ తీసుకోవాల్సి రావచ్చుననే వార్త ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర సంచలనం రేపుతోంది.
నో చెబితే యాక్షన్: ఓసీఏ రూల్స్‌తో ఇరకాటంలో భారత్
ఈ అంశంపై ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నిబంధనలు బీసీసీఐని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. ఆర్టికల్ 66 ప్రకారం విక్టరీ సెరెమనీలో మెడల్స్ ప్రెసెంట్ చేసే అధికారం ఓసీఎ అధ్యక్షుడికి ఉంటుంది. ఒకవేళ ఆయన పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, పీసీబీ చీఫ్ అయిన మొహ్సిన్ నఖ్వీకి ఆ బాధ్యత అప్పగిస్తే, భారత అథ్లెట్లు కచ్చితంగా అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. OCA నిబంధనల ప్రకారం రాజకీయ లేదా ఇతర కారణాలతో విజేతల వేదికపై మెడల్స్ తీసుకోవడానికి నిరాకరిస్తే దాన్ని ఆసియా గేమ్స్‌ను అవమానించినట్లుగా పరిగణించి, భారత జట్టుపై క్రమశిక్షణా చర్యలు (Disciplinary Action) తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆసియా కప్‌లో బీసీసీఐ బిగ్ షాక్:
ఇటీవలే ముగిసిన మహిళల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. అంతకుముందు పురుషుల ఆసియా కప్‌లోనూ భారత జట్టు నఖ్వీ నుంచి మెడల్స్ అందుకోవడానికి సున్నితంగా నో చెప్పేసింది. పాకిస్థాన్ ప్రభుత్వంతో ఉన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతలతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఆసియా గేమ్స్ పొడియంపై మళ్లీ అదే వివాదం రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
ALSO READ : ఆసియా గేమ్స్ కిట్‌పై గందరగోళం..
ముందు గెలవనివ్వండి.. అప్పుడు చూద్దాం: బీసీసీఐ
ఈ వివాదంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ప్రస్తుతం మా దృష్టంతా మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంది. ముందుగా మా జట్లు ఫైనల్ చేరి పొడియం వరకు వెళ్లాలి.. ఆ క్షణంలో ఉన్న పరిస్థితులు, ప్రొటోకాల్స్‌ను బట్టి మేము తగిన నిర్ణయం తీసుకుంటాం.. ఇంకా జరగని విషయాల గురించి ముందే వ్యాఖ్యానించడం సరికాదు.. ప్లేయర్లు, బోర్డు కేవలం పసిడి పతకాలు సాధించడంపైనే ఫోకస్ పెట్టారని స్పష్టం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత పురుషుల, మహిళల జట్లు గోల్డ్ మెడల్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుండటంతో, విక్టరీ ప్రెజెంటేషన్ సమయానికి ఈ స్పోర్ట్స్ డ్రామా ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
