హిందీకి నో.. ద్విభాషా విధానమే కొనసాగిస్తాం.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత తమిళనాడు క్లారిటీ

హిందీకి నో.. ద్విభాషా విధానమే కొనసాగిస్తాం.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత తమిళనాడు క్లారిటీ

హిందీ బోధనపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏళ్లుగా అమలు చేస్తున్న ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. పాఠశాలల్లో తమిళం, ఇంగ్లీష్‌ మినహా మూడో భాషగా హిందీని ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హిందీ బోధనపై వైఖరి మార్చుకోవాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. అవి కేవలం కోర్టు వ్యాఖ్యలు మాత్రమేనని, తీర్పు కాదని పేర్కొంది. తమ భాషా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానానికి కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం (NEP 2020) లోని ‘త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రంలోని పాఠశాలల్లో కేవలం తమిళం, ఇంగ్లీష్ భాషలను మాత్రమే బోధించే విధానాన్ని తమిళనాడు అధికారికంగా కొనసాగిస్తోందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.  కేంద్ర ప్రభుత్వ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా 2025 ఆగస్టులో సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రకటించిన  రాష్ట్ర విద్యా విధానం లో కూడా ఈ ద్విభాషా సూత్రాన్ని స్పష్టంగా చెప్పారు. 

నవోదయ విద్యాలయాల వివాదం..కేంద్రం ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలలు త్రిభాషా విధానంలో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. ఆ స్కూళ్ల  ద్వారా హిందీని రాష్ట్రంలో ప్రవేశపెట్టడాన్ని తమిళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  నవోదయ పాఠశాలల స్థాపనకు భూమి కేటాయించకుండా నిరాకరిస్తూ వస్తోంది. ఇటీవలే సుప్రీంకోర్టు ఈ విషయమై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ తమ ద్విభాషా విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ వాదన: హిందీ నేర్చుకోకపోయినా సైన్స్, అంతరిక్ష పరిశోధనలు (ISRO), నోబెల్ బహుమతుల వరకు తమిళులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఇంగ్లీష్, సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక విద్యకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మూడో భాషగా హిందీని వ్యతిరేకిస్తూ తమ భాషా సంస్కృతులను రక్షించుకోవడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేసింది.