వర్కింగ్ హాలిడే వీసా.. ఇప్పుడు డిమాండు ఉన్న వీసాలలో ఒకటి. చాలా మంది ఇండియన్స్ ఈ వీసాలపై విదేశాలకు వెళ్తుంటారు. ఇది ఒకరకంగా ట్రావెలింగ్ వీసా అయినప్పటికీ ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మిగతా వీసాలాగా ఏ కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం లేదు. ఈ వీసాకు ఉన్న డిమాండ్ వల్ల తక్కువ పరిమితిలో లభిస్తాయి. వర్కింగ్ హాలిడే వీసా అంటే ఏమిటి? వీసా దేనికి ఉపయోగపడుతుంది..?ఎవరు అప్లయ్ చేసుకోవచ్చు..? ఏయేదేశాలు ఈ వీసాలను జారీ చేస్తున్నాయి వంటి ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుందాం.
వర్కింగ్ హాలిడే వీసా (Working Holiday Visa) ..విదేశాల్లో టూరిస్టులుగా ప్రయాణించే వీసా.. అయితే సాధారణ టూరిస్టు వీసాకు దీనికి చాలా తేడా ఉంది.. బెనిఫిట్స్ ఎక్కువే. విదేశాల్లో సెలవులు గడుపుతూనే అక్కడ ఉద్యోగం చేయొచ్చు. చిన్నపాటి చదువులు అంటే షార్ట్ టర్మ్ కోర్సులు చదవొచ్చు. సాధారణ వర్క్ వీసాలలాగా దీనికి ముందుగానే ఏ కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ లేదా స్పాన్సర్‌షిప్ అవసరం లేదు.
భారతీయులకు ఆస్ట్రేలియా వర్క్ అండ్ హాలిడే వీసా..
ఆస్ట్రేలియా- ఇండియా ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (AI-ECTA) ప్రకారం, భారతీయ యువత కోసం ఆస్ట్రేలియా వర్క్ హాలిడే వీసా(subclass 462) ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వీసాకు అప్లయ్ చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రతి సంవత్సరం కేవలం వెయ్యి మంది అర్హులైన భారతీయులకు మాత్రమే ఈ వీసా మంజూరు చేస్తుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ఎంపిక విధానం: డిమాండ్ బాగా ఉండటం వల్ల ఈ వీసా పొందడం సులువేం కాదు. ఎక్కువ మంది ఈ వీసాలకు అప్లయ్ చేస్తుంటారు. కాబట్టి లక్కీ డ్రా(ప్రీ అప్లికేషన్ బ్యాలెట్) పద్ధతితో ఎంపిక చేస్తారు. ప్రతి ఏటా జూన్ లో ఈ వీసాలకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.
ఈ వీసాతో ఆస్ట్రేలియాలో 12 నెలల పాటు ఉండవచ్చు. అక్కడ షార్ట్-టర్మ్ వర్క్ అంటే ఒకే యజమాని వద్ద గరిష్టంగా 6 నెలలు, 4 నెలలు చదువుకోవచ్చు.
ఈ వీసాకు అప్లయ్ చేసుకోవాలంటే ..కనీసం రెండు ఏళ్ల కళాశాల/యూనివర్సిటీ విద్యను పూర్తి చేసి ఉండాలి. IELTS, TOEFL , PTE వంటి పరీక్షల ద్వారా కనీస ఇంగ్లీష్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.
ఇక ఆస్ట్రేలియాలో ఉండటానికి కనీసం 5,000 AUD (సుమారు రూ.2లక్షల75వేలకు పైగా బ్యాంకు బ్యాలెన్స్ , తిరుగు ప్రయాణ టికెట్ లేదా దానికి సరిపడా డబ్బు చూపించాలి.
ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఈ వీసాపై వెళ్లేవారు వారికితోడుగా డిపెండెంట్ పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతించరు.
వీసా జారీ చేసే మరికొన్ని దేశాలు..ప్రపంచవ్యాప్తంగా కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), జర్మనీ వంటి అనేక దేశాలు పరస్పర ఒప్పందాల ద్వారా ఈ వీసాలను అందిస్తున్నాయి. ఈ వీసాకు 35 ఏళ్ల గరిష్ట వయోపరిమితి, మెడికల్ చెకప్, పోలిస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ప్రయాణించే దేశంలో చెల్లుబాటు అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
వర్కింగ్ హాలిడే వీసా కోసం అధికారిక వివరాలు,తదుపరి బ్యాలెట్ రిజిస్ట్రేషన్ అప్‌డేట్స్ కోసం ఆస్ట్రేలియా Department of Home Affairs వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
