15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడనే కారణంతో సంజు శాంసన్ ని జట్టు నుంచి తొలగించడం ఏమాత్రం సరికాదని భారత మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ బెంచ్‌కే పరిమితం కాగా, సంజు వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఈ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజు శాంసన్, రోహిత్ శర్మ రిటైర్మెంట్, ఆసియా కప్ ట్రోఫీ వివాదంతో పాటు యంగ్ స్టార్ శ్రీ చరణి ప్రదర్శనపై అంజుమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సంజుని ప్రశాంతంగా ఆడనివ్వండి:
కొత్త ప్రతిభ వెలుగులోకి రాగానే ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్ల విలువను తగ్గించకూడదని అంజుమ్ చోప్రా సూచించింది. సంజును ప్రశాంతంగా తన ఆట ఆడనివ్వండి.. భారత జట్టులో చోటు కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది, కానీ తన స్థానంపై నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతుంటే ఏ ఆటగాడూ స్వేచ్ఛగా ఆడలేడు.. సంజు, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడే, అతడికి మున్ముందు చాలా అవకాశాలు వస్తాయి.. కానీ ఒకరి స్థానంలో ఇంకొకరిని వెంటనే భర్తీ చేయాలనే ఆలోచన సరికాదని ఆమె పేర్కొన్నారు.
రిటైర్మెంట్ అనేది రోహిత్ శర్మ ఇష్టం:
2027 వన్డే వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మ వయస్సు 40 ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో అతడి రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై మాజీ మహిళ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు మైదానంలో ఉంటేనే క్రికెట్‌కు అందం.. రోహిత్ ఇంకా ఆడాలా లేదా అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయం.. తనలో ఇంకా ఆడే ఉత్సాహం, ఫిట్‌నెస్ ఉంటే ఖచ్చితంగా కొనసాగాలి.. క్రికెటర్‌గా సరైన సమయం వచ్చినప్పుడు హిట్ మ్యాన్ స్వయంగా ఆ నిర్ణయం తీసుకుంటాడని చెప్పుకొచ్చింది.
ట్రోఫీ చేతికి రాకపోయినా మేమే ఛాంపియన్స్:
ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్‌లో విజేతగా నిలిచినా ట్రోఫీ ప్రెజెంటేషన్ చుట్టూ ముసురుకున్న వివాదంపై అంజుమ్ స్పందించారు. ఫిజికల్‌గా చేతికి ట్రోఫీ అందకపోయినా, ఆసియా కప్ విజేతలు భారతే అనే నిజాన్ని ఎవరూ మార్చలేరు.. విజయానికి తగ్గ గుర్తింపు దక్కడం ముఖ్యమే.. ఇలాంటి సంఘటనలు ప్లేయర్ల మనోధైర్యాన్ని లేదా టీమ్ కాంబినేషన్‌ను ఎంతమాత్రం దెబ్బతీయలేవని తేల్చి చెప్పింది. మ్యాచ్‌లు గెలవడంపైనే ఆటగాళ్లు దృష్టి పెడతారని తేల్చి చెప్పారు.
శ్రీ చరణి సంచలనం:
టీమిండియా యంగ్ బౌలర్ శ్రీ చరణి ప్రదర్శనను అంజుమ్ చోప్రా ఆకాశానికెత్తారు. గత 15-–16 నెలలుగా శ్రీ చరణి అంతర్జాతీయ స్థాయిలో చూపుతున్న స్థిరత్వం అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో 10 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలవడం, ఆ తర్వాత వరల్డ్ కప్‌లో 14 వికెట్లతో చెలరేగడం ఆమె కష్టానికి నిదర్శనం. డబ్ల్యూపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చరణి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ నిరంతరం మెరుగవుతూ జట్టుకు ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడుతోందని ప్రశంసించారు.
