మా షరతులు అంగీకరించాలి లేదంటే  యుద్ధాని రెడీ.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

మా షరతులు అంగీకరించాలి లేదంటే  యుద్ధాని రెడీ.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

టెహ్రాన్‌: అమెరికాతో తిరిగి చర్చలు ప్రారంభించేందుకు ఇరాన్‌ ఏడు షరతులను ప్రతిపాదించింది. ఖతార్‌ మధ్యవర్తిత్వం ద్వారా ఈ షరతులను అమెరికాకు చేరవేసినట్లు ఇరాన్‌ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇరాన్‌ ప్రతిపాదించిన షరతుల్లో యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్‌ నిధులను విడుదల చేయడం, అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని రెజాయీ చెప్పారు. మిగిలిన షరతులను వెల్లడించలేదు

అమెరికా  మా షరతులు అంగీకరించాల్సిందే

ఖతార్‌ తమ షరతులను వాషింగ్టన్‌కు చేరవేసిందని, ఇప్పుడు ట్రంప్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని రెజాయీ తెలిపారు. అమెరికా బెదిరింపులతో తమ వైఖరిలో మార్పు ఉండదని ఆయన తెలిపారు.ఇరాన్‌ తమ డిమాండ్లను అమెరికా అంగీకరించకపోతే సైనికపరంగా కూడా సిద్ధంగా ఉందని రెజాయీ హెచ్చరించారు. ‘నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

మరోసారి అమెరికా దాడి జరిగే అవకాశం?

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు సూచిస్తున్నాయని రెజాయీ తెలిపారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ సైనిక ప్రణాళికలను ఇప్పటికే మార్చుకున్నామని చెప్పారు.గల్ఫ్‌ ప్రాంతం నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, అరేబియా సముద్రం వరకు మోహరించిన అమెరికా నౌకాదళ ఆస్తులపై తమ ప్రణాళికలు ప్రధానంగా దృష్టి సారించాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికా నౌక లేదా విమాన వాహక నౌక సమీపంలో బహుళ వార్‌హెడ్‌లతో కూడిన యాంటీ-షిప్ క్షిపణిని పరీక్షించినట్లు కూడా రెజాయీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడి జరిగితే అమెరికా సైనిక స్థావరాలతో పాటు ప్రాంతంలో ఉన్న అమెరికా వాణిజ్య ప్రయోజనాలు, కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.